NPRD : సమగ్ర కుటుంబ సర్వేలో 21 రకాల వైకల్యాలకు చోటు ఎక్కడ? ఎన్పీఆర్డీ కీలక డిమాండ్

సమగ్ర కుటుంబ సర్వేలో 21 రకాల వైకల్యాలకు చోటు ఎక్కడ? అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Update: 2024-11-11 07:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సమగ్ర కుటుంబ సర్వేలో 21 రకాల వైకల్యాలకు చోటు ఎక్కడ? అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సోమవారం మెయిల్, వాట్సాప్ ద్వారా తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ కి వినతిపత్రం పంపించారు. కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు సేకరించడానికి పార్ట్ -1 ఫారంలో 13వ నెంబర్ కాలమ్‌లో మీరు దివ్యంగులా అని అడిగారు.. అంటూ తెలిపారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 21 రకాల వైకల్యాలను గుర్తించిందన్నారు. సర్వే పత్రంలోని కాలమ్ 13 లో కోడ్ నింపడానికి షెడ్యూల్ నింపడానికి సూచనలు పేరుతో ప్రత్యేకంగా హ్యాండ్ బుక్ ఇచ్చారని పేర్కొన్నారు. హ్యాండ్ బుక్ లో మిగతా వివరాలు సమగ్రంగా ఉన్నప్పటికీ వికలాంగుల వివరాలు మాత్రం సమగ్రంగా లేవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో 21 రకాల వికలాంగులను విస్మరించడం దురదృష్టకరమన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో 21 రకాల వైకల్యాలను గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను మోసం చేసిందని ఆరోపించారు. సకలాంగులకు, కులాలకు ఇచ్చిన ప్రాధాన్యత వికలాంగులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం వికలాంగుల గురించి ఏనాడు పట్టించుకోలేదని వెల్లడించారు. మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విషయంలో గత ప్రభుత్వం బాటలోనే నడుస్తుందని విమర్శించారు. సర్వే పత్రంలో వికలాంగుల వివరాలు (వైకల్యం రకాలు) లేకుండా ప్రింట్ చేయడం ఆంటే వికలాంగుల పట్ల వివక్షత తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వికలాంగుల పట్ల వివక్షత చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సర్వేలో 21 రకాల వికలాంగుల వివరాలు సేకరించడానికి ప్రతి వైకల్యానికి ఒక్క కోడ్ ఉండాల్సిన అవసరం ఉందని, 21 రకాల వైకల్యాలకు వెంటనే కోడ్ లు కేటాయించి సర్వే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిపై సర్వేకు వస్తున్న సిబ్బందిని నిలదీయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News