BRS నేతల్లో కేసీఆర్ గుబులు.. పార్టీ సభలపై సతమతం
బీఆర్ఎస్ నెక్ట్స్ మీటింగ్ ఎక్కడో క్లారిటీ లేదు. విశాఖలో సభలో కోసం ఏపీ యూనిట్ ప్లాన్ చేస్తుండగా, మహారాష్ట్రలో నిర్వహించి సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నెక్ట్స్ మీటింగ్ ఎక్కడో క్లారిటీ లేదు. విశాఖలో సభలో కోసం ఏపీ యూనిట్ ప్లాన్ చేస్తుండగా, మహారాష్ట్రలో నిర్వహించి సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పార్టీ అధినేత ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్తే తెలంగాణపై ఫోకస్ తగ్గితే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమవుతోందనని పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తే.. ఆ సభలకు కేసీఆర్ హాజరై హామీలు గుప్పిస్తే తమకు గెలుపు ధీమా ఉంటుందనే అభిప్రాయపడుతున్నారు. అయితే అధినేత మదిలో ఏమున్నదో తెలియక సతమతమవుతున్నారు.
దేశ రాజకీయాలపైనే కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభలు నిర్వహించి ఆ రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రాజకీయ ప్రవేశం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులతో పాటు కేడర్‌ను బలోపేతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అవసరమైతే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడి ప్రాంతీయపార్టీలతో కలిసి పోవాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఒంటరిగా పోవాలా? ఏదైనా పార్టీతో పొత్తుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఖమ్మం సభ తర్వాత ఏపీలో గానీ, మహారాష్ట్రలో గానీ సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే తొలిసభను ఏపీలోని విశాఖలో నిర్వహించేందుకు ఆ రాష్ట్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఏపీపై జరిగింది.
అయితే ఆరాష్ట్ర ప్రజల వద్దకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అయితే అక్కడ భారీసభను నిర్వహించి తెలంగాణ అభివృద్ధిని అక్కడి ప్రజలకు వివరించాలని, పరిచయం చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే పొరుగున ఉండే మరో రాష్ట్రం మహారాష్ట్రలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. తెలుగువారు ఎక్కువగా ఉండటంతో అక్కడే సభను సక్సెస్ చేసి తెలంగాణ అభివృద్ధిని వివరించి అక్కడి ప్రజలను బీఆర్ఎస్ వైపు ఆకర్షితులను చేసేందుకు ప్రణాళికల రూపొందిస్తున్నారు. అయితే ఏపీ, మహారాష్ట్రలో ఎక్కడ సభ నిర్వహిస్తారో అనేది పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గులాబీ లీడర్ల ఆందోళన
అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో గులాబీ లీడర్లలో ఆందోళన మొదలైంది. జాతీయ రాజకీయాల పేరుతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కేసీఆర్ చర్యలు తీసుకుంటుండటంతో టెన్షన్ పడుతున్నారు. తెలంగాణలో పార్టీపై దృష్టిని కేంద్రీకరించకపోతే తమ రాజకీయ భవితవ్వం ఏంటని మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించినప్పటి నుంచి కేసీఆర్ పై ప్రజలకు ఉన్న ఆదరణతో ఆయన బొమ్మపైనే ఎక్కువమంది గెలిచారు. అయితే ప్రస్తుతం జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ సమయంను కేసీఆర్ కేటాయిస్తుండటం, నిత్యం ఆయా రాష్ట్రాల నేతలతో సంప్రదింపులు, పార్టీ బలోపేతంకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణపై తక్కువ సమయం కేటాయిస్తున్నారని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
సభలు అవసరమని ఎమ్మెల్యేల భావన
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ప్రారంభించిన అభివృద్ధి పనులు సైతం పూర్తికాకపోవడం, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరడం లేదు. దీంతో రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అయితే వాటి పూర్తికి, గ్రామాల అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వరద పారాలంటే నియోజకవర్గంలో కేసీఆర్ సభలు నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. సభలతో కేసీఆర్ ప్రజల దృష్టిని సైతం పార్టీవైపు మళ్లిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అధినేత మదిలో ఏముందో నేతలకు తెలియకపోవడంతో సతమతమవుతున్నారు.
Also Read...