ఐఎంఎల్ డిపోలో ఆ అధికారుల అడ్రస్ ఎక్కడ..?
వైరాలోని ఐఎంఎల్ డిపోలో పనిచేయాల్సిన ఇద్దరు అధికారుల అడ్రస్ కనిపించడం లేదు.
దిశ, వైరా : జిల్లాలోని వైన్ షాపులు, బార్లకు మద్యం సరఫరా చేసే వైరాలోని ఐఎంఎల్ డిపోలో పనిచేయాల్సిన ఇద్దరు అధికారుల అడ్రస్ కనిపించడం లేదు. ఈ డిపోలో పూర్తి వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఓ ఉన్నతాధికారి నెలలో ముచ్చటగా మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. గత నాలుగేళ్లగా ఇక్కడ పనిచేస్తున్న ఆ ఉన్నతాధికారి రెగ్యులర్‌గా విధులకు హాజరైన దాఖలాలే లేవు.
"గేదె పొలంలో మేస్తుంటే దూడగట్టున మేస్తుందా" అన్న చందాగా ఉన్నతాధికారి విధులకు హాజరు కాకపోవటంతో దానిని అలుసుగా తీసుకున్న ఇక్కడ పని చేసే ఎక్సైజ్ అధికారి వారానికి మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. విధులకు హాజరైన రోజు కూడా సమయపాలన అనేది ఆ ఎక్సైజ్ అధికారి డిక్షనరీలో లేదు. సంవత్సరాల తరబడి ఈ తంతు నడుస్తూనే ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఆ ఇద్దరు అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది. ప్రతి నిత్యం కోట్లాది రూపాయల మద్యాన్ని వైన్ షాపులు, బార్లకు విక్రయించే ఈ డిపోలో ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడటం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.
నాలుగేళ్లగా నడుస్తున్న తంతు..
వైరాలోని ఐఎంఎల్ డిపోలో గత నాలుగేళ్ల క్రితం ఓ ఉన్నతాధికారి విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన రెగ్యులర్‌గా విధులకు హాజరైన పాపాన పోలేదు. నెలకు మూడు నుంచి నాలుగు సార్లు ఆయన విధులకు హాజరవుతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. ఆయన ప్రతివారం వీకెండ్ అయిన శనివారం విధులుకు హాజరై వారం రోజులపాటు తాను విధులకు హాజరైనట్లు ఒకేరోజు రిజిస్టర్లో సంతకాలు చేస్తుండటం విశేషం.
మిగిలిన రోజులన్నీ హైదరాబాద్‌లో తన నివాసం గృహంలోనే ఆయన కాలాన్ని గడుపుతున్నారు. దీంతో వైరా ఐఎంఎల్ డిపో నిర్వహణ పర్యవేక్షించే వారే కరువయ్యారు. వైరా ఐఎంఎల్ డిపో గోదాముల్లో లిక్కర్‌ను, తల్లాడలో లీజుకు తీసుకున్న గోదాములో బీర్ల కేసులను నిల్వ చేస్తున్నారు. ఈ రెండు గోదాముల్లో ఉన్నతాధికారి పర్యవేక్షణ కరువైంది. ప్రధానంగా తల్లాడ గోదాంలో హమాలీలతో పాటు, ఐఎంఎల్ సిబ్బంది ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది.
ఐఎంఎల్ డిపోలో మద్యం నిల్వలు, మద్యం ఎగుమతులు, దిగుమతులతో పాటు ఇతర పనులన్నీటిని ఉన్నతాధికారి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే వైరా డిపోలో మాత్రం ఆ ఉన్నతాధికారికి ఎలాంటి నిబంధనలు వర్తించటం లేదు. నెలలో మూడు, నాలుగు సార్లు డిపోకు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసుకొని దర్జాగా వెళుతున్న సదరు ఉన్నతాధికారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఐఎంఎల్ డిపోకు ఉన్నతాధికారి విధులకు హాజరు కాకపోవడంతో ఎప్పుడు చూసినా ఆ అధికారి గదికి తాళం వేసి దర్శనమిస్తోంది.
ఎక్సైజ్ అధికారిది అదే తీరు....
ఈ డిపోలో పని చేసే ఎక్సైజ్ అధికారి అదే తీరులో వ్యవహరిస్తున్నారు. సదరు అధికారి వారానికి మూడు రోజులు మాత్రమే డిపోలో విధులకు హాజరవుతున్నారు. ఆ మూడు రోజుల కూడా విధులకు సమయపాలన పాటించటం అనేది ఆయన డిక్షనరీలో లేకుండా పోయింది. వరంగల్‌లో నివాసం ఉంటున్న సదరు అధికారి అడపాదడపా కార్యాలయానికి వచ్చిన రోజుల్లో కూడా సకాలంలో విధులు హాజరుకారు. మధ్యాహ్నం 12 నుంచి 1:00 లోపలో ఆయన విధులకు హాజరవుతారు.
మరలా తిరిగి సాయంత్రం నాలుగు గంటలకే తనకు ట్రైన్ టైం అవుతుందని వెళ్ళిపోతారు. నిబంధనల ప్రకారం ఎక్సైజ్ అధికారి మద్యం డిపో నుంచి వైన్ షాపుల, బార్ షాపుల యజమానులు కొనుగోలు చేసి తీసుకువెళుతున్న మద్యానికి ట్రాన్స్ పోర్ట్ పర్మిట్ దగ్గరుండి మంజూరు చేయించాల్సి ఉంటుంది. అయితే ఆ అధికారి ఈ పనులను డిపోలోని సిబ్బందికి అప్పగించారు. వైరా ఐఎంఎల్ డిపోకు ఇతర రాష్ట్రాల డిస్టలరీస్ నుంచి మద్యం రవాణా అవుతోంది.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ మద్యానికి సదరు ఎక్సైజ్ అధికారి తెలంగాణ ఆబ్కారి శాఖకు సంబంధించిన లేబుల్స్‌ను బాటిల్‌పై వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ పనిని తన కింద పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌కి అప్పగించారని ప్రచారం జరుగుతుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనిచేస్తున్న ఎక్సైజ్ అధికారి గురించి కూడా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంవత్సరాలు తరబడి విధులకు గైరాజరుగుతున్న ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటారో.. లేదంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో చూడాలి..