ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడమంటే ఏంటి..? డిపాజిట్ కోల్పోతే ఏమవుతుంది..?
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానుండగా.. వీటితో దేశ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకోనున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై అందరి దృష్టి పెట్టింది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై ప్రజల నాడిని పసిగట్టేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే అనేక సర్వేలు వెలువడుతున్నాయి.
అయితే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు అనే మాట మనం వింటూ ఉంటాం. ఎన్నికల ప్రచారంలో కూడా డిపాజిట్లు కూడా రావని ప్రత్యర్థులపై నేతలు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అసలు డిపాజిట్లు కోల్పోవడం ఏంటి? డిపాజిట్ కోల్పోతే ఏమవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రూ.10 వేల సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5 వేలు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల్లో నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో 16 శాతానికిపైగా ఓట్లను అభ్యర్థి దక్కించుకుంటే గౌరవప్రదమైన ఓటమిగా భావిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు లభిస్తే డిపాజిట్ కోల్పోయినట్లు లెక్క. డిపాజిట్ కోల్పోయిన వారికి నామినేషన్ సమయంలో చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వరు. దీనినే అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడమని అంటారు. డిపాజిట్ కోల్పోవడాన్ని ఘోర ఓటమిగా పరిగణిస్తారు. వీరి సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును ఈసీ స్వాధీనం చేసుకుంటుంది. ఇక ఆరో వంతు ఓట్లను దక్కించుకున్న వారికి సెక్యూరిటీ సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు.