కవితకు నోటీసులపై కేసీఆర్ రియాక్షనేంటి?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలన మలుపు తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలన మలుపు తీసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఈ మేరకు 41 ఏ సీఆర్పీసీ కింద సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్ లో సీఆర్పీసీ 161 కింద జారీ చేయగా ప్రస్తుతం 41 ఏ కింద నోటీసులు ఇవ్వడం చర్చనీయాశంగా మారింది. అయితే కవితను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ నోటీసులు జారీ చేయడం బీఆర్ఎస్ వర్గాల్లో సంచలనం రేపుతున్నది. ఇప్పటికే కవిత విషయంలో పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారానికి దూరం అయిన తర్వాత ప్రస్తుతం కవిత చేస్తున్న ప్రజా సమస్యల పోరాటానికి పార్టీ తరపున పెద్దగా మద్దతు రావడం లేదనే చర్చ జరుగుతోంది. మహిళలు, విద్యార్థుల ఆత్మహత్యలు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె పోరాటం చేస్తున్నా సొంత పార్టీ నుంచి సపోర్ట్ లేకపోవడం చర్చనీయాశంగా మారింది. పార్టీ నుంచి మద్దతు లేకపోయినా క్యాడర్ కు మాత్రం తానున్నాంటూ కవిత అండగా నిలుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో కవితను నిందితురాలిగా పేర్కొనడంతో ఈ పరిణామంపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.
ఢిల్లీకి వెళ్లాల్సిందే..:
అప్పట్లో ఈ కేసులో ఆమెను ఒక సాక్షిగా పరిగణించడంతో హైదరాబాద్ లోని ఆమె నివాసానికే వచ్చిన సీబీఐ ఐఫీసర్లు టీమ్ 7 గంటల పాటు ప్రశ్నించింది. కానీ ఈ సారి మాత్రం ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్ కే రావాలంటూ నోటీసుల్లో పేర్కొనడం గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. మరో వైపు ఇదే కేసులో ఈడీ ఇప్పటి వరకు కవితను మూడుసార్లు విచారించింది. నాలుగోసారి నోటీసులు ఇవ్వడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈ నెల 28న ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఇంతలో కవిత విషయంలో సీబీఐ తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది.