మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంగతి చెబుతాం : కేటీఆర్
మీరు ఉండేది ఐదేళ్లే..బీఆర్ఎస్ వాళ్లును టార్గెట్ చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అప్పుడు మీ సంగతి చూస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
దిశ, సంగారెడ్డి : మీరు ఉండేది ఐదేళ్లే..బీఆర్ఎస్ వాళ్లును టార్గెట్ చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అప్పుడు మీ సంగతి చూస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లగచర్ల బాధిత రైతులను సంగారెడ్డి జైల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలవటం జరిగిందన్నారు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. లగచర్లలో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల రూపాయల విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారని, కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని విమర్శించారు.
“జైల్లో ఇప్పుడు మేము 16 మందిని కలిశాం. వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉంది..అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారని, ఇంకొక తమ్ముడు వనపర్తిలో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చా”రన్నారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారని విమర్శించారు. ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారని, దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారన్నారు. దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారని, కానీ పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడని ఆరోపించారు.
రాజ్యాంగేతర శక్తిగా మారిని ముఖ్యమంత్రి తమ్ముడు..
ముఖ్యమంత్రి సోదరుడన్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్లో రాజ్యంగేతర శక్తిగా మారాడని కేటీఆర్ ఆరోపించారు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నాడన్నాడని ఆరోపించారు. కొడంగల్లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట..అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని చెబుతున్నారన్నారు. నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే అధికారులపై దాడి చేశారన్నారు. కానీ అరెస్ట్ చేసిన 70 మందిలో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్లు ఉన్నారని గుర్తించి 21 మందిని మాత్రమే చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టారని ఆరోపించారు. మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు.. కానీ దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారని, ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే చేశారని చెప్పాలని కుట్ర చేస్తున్నారన్నారు.
వాళ్ల చేతగానితనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే అని, వికారాబాద్ ఎస్పీ, సీఐలు, ఎస్ఐలు చిత్ర హింసలు పెట్టారని, వారిని మూడు మూడు గంటలపాటు విపరీతంగా కొట్టారన్నారు. మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని వాళ్లు మాకు చెప్పారని, తీవ్రవాదులను పట్టుకొనేందుకు వెళ్లినట్లు డోర్లను తంతు పోలీసులు ఊర్లో భయానక వాతావరణ సృష్టించారని ఆరోపించారు. అదే విధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తాగి బూతులు మాట్లాడుతూ ప్రజలపై దాడులు కూడా చేశారన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరుండేది ఐదేళ్లు మాత్రమే.. అధికారం శాశ్వతమని భావించకండి అన్నారు. నువ్వు చక్రవర్తివి కాదు. నీలాంటి చాలా మంది చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు అది గుర్తించుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు గుంజుకుంటా అంటే మేము ఊరుకోమని, రేవంత్ రెడ్డిపై ఇవాళ కొడంగల్ మర్లవడ్డది, రేపు తెలంగాణ మొత్తం మర్లవడుతదన్నారు.
దాడులపై రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి..
లగచర్ల ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు. మేము అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. రైతులను వదిలేయ్..నువ్వు అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తాకుతుందని శాపనార్థాలు పెట్టారు. ఏ పేద ప్రజల ఓట్లతో గెలిచావో ఆ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీకు వాళ్ల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. 21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాఘవేంద్ర అనే ఉద్యోగి తన ఉద్యోగం కోసం భయపడుతున్నాడని, ఆయన ఉద్యోగం పోకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామన్నారు. మిగతా బాధిత రైతులకు కూడా చెబుతున్నా మీరు భయపడవద్దని, ఇంతకంటే మిమ్మల్ని వాళ్లు ఏం చేసేది లేదు.. ధైర్యంగా ఉండాలని సూచించారు.
తన వైఫల్యాలను తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి ఈ డ్రామాలు చేస్తున్నాడని, 60, 70 లక్షలు విలువ చేసే భూమికి 10 లక్షలు ఇస్తా అంటే రైతులు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. అదే విధంగా సంగారెడ్డి న్యాల్కల్ వద్ద కూడా భూసేకరణ విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ ఫార్మాసిటి కోసం హైదరాబాద్లో 14 వేల ఎకరాలు సేకరిస్తే దాన్ని వద్దని ఆ భూముల్లో ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని ఆరోపించారు. ఫార్మా విలేజ్ పేరుతో తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడని, పేదలు, కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, అనిల్ జాదవ్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, పార్టీ సీనియర్ నాయకులు జాన్సన్ నాయక్, ఎమ్మెల్యే మానిక్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.