శాసన‌సభలో ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.. రియల్టర్స్‌కు అండగా ఉంటాం: మాజీ మంత్రి కేటీఆర్

రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలుసుకోవాలని, దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

Update: 2024-11-05 15:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలుసుకోవాలని, దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మేము మీకు సంబంధించి శాసన సభలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎఫ్ మాదిరిగానే టీఆర్ఎస్ పెట్టే వరకు కూడా తెలంగాణ శక్తి ఎవరికీ తెలియలేదన్నారు. భూమి కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలు ఇక్కడి బిడ్డలందరికీ తెలుసు అని, ఎన్నో భూ ఉద్యమాలకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితం భూమి చుట్టూ తిరుగుతోందన్నారు. భూమి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కనుకే దానికోసం ఎన్నో పంచాయితీలు జరుగుతాయన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మొదట్లో రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో పట్టు దొరకలేదన్నారు.

తెలంగాణ ఏర్పడితే హిందూ, ముస్లిం పంచాయతీ, నక్సలిజం, భూముల ధరలు పడిపోతాయంటూ ప్రచారాలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతుందంటే ఎవరు నమ్మలేదన్నారు. అసలు రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకు ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. అభివృద్ధే మా మతం, సంక్షేమమే మా కులం అంటూ కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. గతంలో బంగారం గానీ బ్యాంకుల్లో గానీ డిపాజిట్ చేసేవారన్నారు. కానీ గత 20 ఏళ్లుగా మాత్రం మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లు భూమి మీద పెట్టుబడి పెట్టారన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన సరే ఎకరానికి రూ.15లక్షలు పలుకుతుందన్నారు. భూమి విలువ పెరిగితే భూమి ఉన్న యాజమానికి ఎంతో భరోసా ఉంటుందన్నారు.

రైతు భరోసా వచ్చి, సాగు నీళ్లు వచ్చి, 24 గంటల కరెంట్ వచ్చి ఇవ్వాళ ప్రతి రైతు ఎంతో భరోసా ఉన్నాడు... దానికి కారణం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ మార్పు అని ప్రచారం చేసిందని, మరీ మార్పు ఎలా ఉంది? అని నిలదీశారు. తెలంగాణ రాకముందు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేస్ ఉండేదన్నారు. రైతులు అర్థరాత్రి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, మొత్తం ఆ పరిస్థితిని కేసీఆర్ మార్చేశారన్నారు. నీళ్లు, కరెంట్ సమస్యను తీర్చేశారన్నారు. తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే జరగలేదని, సమగ్ర, సమీకృత అభివృద్ధిని కేసీఆర్ చేయడంతోనే పెరిగిందన్నారు. మా ప్రత్యర్థులు మాత్రం డెవలప్ మెంట్ ఆటో పైలట్ మోడ్‌లో ఉందని అంటారని, మరీ ఈ ఏడాది ఎందుకు డెవలప్ మెంట్ జరగటం లేదని, మంచిగా చేసిన కరెంట్‌ను కూడా నాశనం చేశారని మండిపడ్డారు.

ఏ రైతును కదలించినా బాధపడుతున్నారన్నాని తెలిపారు. నల్గొండ‌లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్‌లో వాళ్ల పార్టీ నాయకులే కాంగ్రెస్ చేసిన మోసాలను చెబుతున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు బిల్డర్లు కనీసం పర్మిషన్లు కూడా తీసుకోవటం కష్టమైపోతోందన్నారు. శక్తికి మించిన పెట్టుబడులు పెట్టామని, కానీ మా భూములు అమ్ముడు పోవటం లేదని బిల్డర్లు బాధపడ్డారన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. మంత్రి పదవి గురించి అడిగితే గుంపు మేస్త్రి మాదిరిగా పనిచేస్తా అన్నాడని ఎద్దేవా చేశారు. మరి 11 నెలలు అయ్యిందని, ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదన్నారు.

హైడ్రా పేరుతో ఆలోచన లేకుండా చేస్తున్నారని, కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసం దాన్ని పెట్టారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ కు లేక్ వ్యూ అని పేరు పెట్టాలంటే భయపడుతున్నారని, పర్మిషన్ కావాలంటే అది గాలిలో దీపం మాదిరిగా అయ్యిందని అన్నారు. ప్రాజెక్ట్ లు రద్దు చేస్తున్నాడు... కొత్త ప్రాజెక్టులు లేవు, బిల్డర్లను బెదిరించి డబ్బులు కావాలని అంటున్నాడు.. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పంపించాలని ఎద్దేవా చేశారు. మా మీద కోపంతో వేల మంది కడుపులు కొట్టొద్దు... మంచిపనులు చేయండి అని సీఎం కు సూచించారు. రైతు బంధు వేస్తే మళ్లీ ఆ డబ్బు ప్రభుత్వానికే ట్యాక్స్ రూపంలో వస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి ఏం తెలియదు... తెలియదన్న విషయం కూడా ఆయన కు తెలియదు అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని అన్నారని, కానీ ఇప్పుడు ముక్కు పిండి మరీ ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ఇది మధ్యతరగతి ప్రజలకు నష్టం చేస్తుందని, ఎఫ్టీఎల్ లాంటి ప్లేస్ లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయని, ప్రభుత్వంలో ఒక చేయి ఏం చేస్తుందో... మరో చేయికి తెలియదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో ఆనాలోచితంగా కూల్చివేయటంతో ఓ గర్భిణీ మహిళ 40 ఏళ్లు ఎలా ఈఎంఐ కట్టాలని ప్రశ్నించిందని, దీనికి హైడ్రానా? మున్సిపల్ శాఖనా? ముఖ్యమంత్రా? ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

రెరాతో మాట్లాడి లీగల్ ఒపీనియన్ తీసుకొని తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ మరింత బలపడాలన్నారు. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ గెలవటం ఖాయమని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయలేదని, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేయాలని భావించాం అన్నారు. ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకొని ప్రజలకు మంచి చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.


Similar News