ప్రజా శ్రేయస్సుకు ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం : మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క

ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం ప్రతిపక్షాల సహేతుమైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

Update: 2024-01-04 15:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం ప్రతిపక్షాల సహేతుమైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కానీ, తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని సూచించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే, బీఆర్ఎస్‌కు అక్కసెందుకు? అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన సర్కార్‌గా ప్రజలకు ఏం చేయాలో, తమకు తెలుసునని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు.

గత ఏడాది డిసెంబరు 3న ఫలితాలు వెలువడగా.. 7న సీఎంతో పాటు క్యాబినేట్ కూర్పు జరిగిందని పేర్కొన్నారు. ఈ వెంటనే అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించామని తెలిపారు. కానీ, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజులు తరువాత శాసన‌సభ సమావేశాలు నిర్వహించారని గుర్తు చేశారు. రెండు నెలల తర్వాత మంత్రి వర్గం కూర్పు జరిగిందన్నారు. ఏ ప్రభుత్వం స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటుందో ప్రజలకు అర్ధం అవుతోందన్నారు. కానీ, తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలు పెట్టామని అన్నారు. మహిళా సోదరీమణుల కోసం ఉచిత బస్ సర్వీస్ సేవలతో పాటు ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంచుతూ ఆదేశాలిచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ స్వేచ్ఛగా తన సొంత బస్సులా భావిస్తూ సేవలు వినియోగించుకుంటున్నారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

గత 3,500 రోజులు బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వ్యవస్థను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. తమ విజయాన్ని ఓర్వలేక నియంతృత్వ ధోరణి‌తో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకి ఇచ్చిన వాగ్ధానాలను ఒకటి తర్వాత మరొకటి నెరవేర్చుతామని తెలిపారు. బీఆర్ఎస్ భవన్ నుంచి చూస్తే ప్రజల సంక్షేమం కనిపించదని, గ్రామాలకు వెళ్తే ఎంత సంతోషంగా కనిపిస్తారని అన్నారు. 2014, 2018 ఎన్నికల ముందు చెప్పిన దళిత సీఎం, మూడెకరాలు భూమి, 12 శాతం రిజర్వేషన్, పీజీ ఉచిత విద్య, వీటన్నింటినీ బీఆర్‌ఎస్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ట్రైబల్ యూనివర్సిటీ ఇలా కనీసం ఒక్క అంశంపై కూడా బీఆర్‌ఎస్ స్పష్టంగా కేంద్రంతో ఫైట్ చేయలేదన్నారు.

అధికారం పోయిందని బాధతో..

బీఆర్ఎస్ తమకు అధికారం పోయిందనే బాధలో విచిత్రంగా మాట్లాడుతున్నదని మంత్రి సీతక్క అన్నారు. పైగా లోకసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని వాళ్లకు అర్ధమైందని, దీంతోనే అధికార పక్షంపై ఇలాంటి ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం గడీల పాలనను స్వస్తి పలికి గల్లీ బిడ్డల పాలనకు శ్రీకారం చుట్టిందన్నారు. పదేళ్లు దోచుకున్న వారే 420‌లు అని సీతక్క విమర్శించారు. ఇక మహిళల ఉచిత బస్సు జర్నీపై ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి బీఆర్ఎస్ ఉద్యమం అంటూ సాకులు చెబుతుందన్నారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News