ఆదివాసీ గ్రామాల్లో నీటి గోస.. ఆఫీసర్ల నుంచి నో రెస్పాన్స్
‘‘అద్భుతమైన మిషన్ భగీరథ స్కీమ్ తో 98.3% పైగా ఆవాసాలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నాం. బంజారాహిల్స్ నుంచి బంజారాలు ఎక్కువ నివసించే తండాలకూ స్వచ్ఛమైన తాగు
దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘అద్భుతమైన మిషన్ భగీరథ స్కీమ్ తో 98.3% పైగా ఆవాసాలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నాం. బంజారాహిల్స్ నుంచి బంజారాలు ఎక్కువ నివసించే తండాలకూ స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేస్తున్నాం. గ్రామాల్లో అనేక రోగాలకు చెక్ పెట్టాం’’ అని సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎన్నోసార్లు గొప్పగా చెప్పుకున్నారు. అయితే.. నిర్వహణ లోపంతో మిషన్ భగీరథ స్కీమ్ నత్తనడక నడుస్తోంది. తాగు నీరు అందక ఆదివాసీ ప్రజలు కష్టాలు పడుతున్నారు.
వేసవి కాలం ఎంట్రీ కావడంతోనే ఆదివాసీ ఏరియాల్లో మంచి నీటి కష్టాలు మొదలయ్యాయి. భద్రాద్రి, ఆదిలాబాద్, మహబూబ్నగర్జిల్లాల్లో సమస్య ఎక్కువగా ఉంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వారం రోజుల వరకూ నల్లా నీళ్లు రావడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట్ మండలం పెద్ద వాగు ప్రాజెక్టు గ్రామంలో నాలుగైదు రోజుల పాటు నీళ్లు రాలేదు. దీంతో అక్కడి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. అశ్వారావు పేట్ మండలంలోని ములుగు, వనపర్తి, ఆసిఫాబాద్ తదితర ఏజెన్సీ గ్రామాల్లో ప్రతి సంవత్సరం వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. అక్కడి ప్రజలు ఆందోళనలు చేసినా అధికారులు స్పందించడం లేదు.
లీకులు.. మోటర్ల రిపేరు.. ట్యాంక్క్లీనింగ్..
గిరిజన గ్రామాల్లో మిషన్భగీరథ పైపులు లీకవుతున్నా మరమ్మత్తులు చేయించే వాళ్లే లేరు. గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ఉండటం, పైప్ లైన్లు పట్టణాలకు దూరంగా ఉండటంతో అధికారులు ఆ దిశగా వెళ్లేందుకే ఆసక్తి చూపడం లేదు. మరికొన్ని చోట్ల కాలిపోయిన మిషన్భగీరథ మోటార్లు రిపేరింగ్ కు నోచుకోవడం లేదు. అంతేకాదు.. ట్యాంక్ ల క్లీనింగ్ పేరిట ఏజెన్సీ ఏరియాల్లో నీటిని వారం, పది రోజుల పాటు విడవడం లేదు. దీంతో గిరిజన మహిళలు మంచి నీటి కోసం బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిషన్ భగీరథ నీళ్లు అందని ఆదివాసీ గ్రామాల ప్రజల కష్టాలు మరింత దారుణంగా ఉన్నాయి. ‘మిషన్ భగీరథతో ఇంటింటా నల్లా నీరు’ అని ప్రభుత్వం చేసిన ప్రచారంతో ఆదివాసీ గ్రామాల ప్రజలు చేతి పంపులు, బోర్లను పట్టించుకోలేదు. తమ ఇంటికీ నల్లా నీరు వస్తుందన్న ఆశ నీరుగారిపోవడంతో ప్రజలు మళ్లీ చేతి పంపుల కోసం పరుగెత్తారు. పని చేయని చేతి పంపులు, ఎండిన బోర్ల నుంచి నీళ్లు రాకపోవడంతో మహిళలు దిక్కులు చూస్తున్నారు.
ప్రభుత్వ లక్ష్యం ఇది..
గోదావరి, కృష్ణా నదుల నుంచి పైపుల ద్వారా తెలంగాణలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2.32 కోట్ల మందికి తాగు నీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యం. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ తో పాటు అన్ని నీటి పారుదల వనరుల్లో 10% నీళ్లను తాగు నీటి కోసం రిజర్వ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.42 వేల కోట్లతో కృష్ణా, గోదావరి నదులతో పాటు ఇతర జలాశయాలను కలుపుతూ 1.3 లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి రాష్ట్రంలోని 24 వేల గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామని తెలిపింది. ప్రజల తాగు నీటి సమస్యను తీర్చడం, స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు ప్రారంభించిన మిషన్ భగీరథ స్కీమ్ అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడక నడుస్తోందని విమర్శలొస్తున్నాయి.
ఆదివాసీల పట్ల వివక్ష
బీఆర్ఎస్ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోంది. అశ్వారావు పేట్ నియోజక వర్గంలోని చాలా మండలాల్లో నీటి సమస్య ఉంది. అధికారులకు చెప్పినా స్పందించడం లేదు. నాయకులు రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. మహిళలు రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చింది.
- వగ్గేల పూజిత, కాంగ్రెస్ నాయకురాలు, అశ్వారావుపేట్
ఎన్నిసార్లు చెప్పినా నో రెస్పాన్స్
బచ్చువారి గూడెం గ్రామ ప్రజలు ప్రతి సమ్మర్ లో నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. పైపులు పగిలాయంటూ 10 రోజుల వరకూ నీళ్లివ్వడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నో రెస్పాన్స్. సర్కారు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.
- రాజేష్ , పీసా కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా