పోడు భూములకు పట్టాలివ్వాలి : నెహ్రు నాయక్
కురవి పట్టణ కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దిశ, మరిపెడ (కురవి ): కురవి పట్టణ కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు మాలోతు నెహ్రు నాయక్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నేషనల్ హైవే పై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం కురవి ఓం పంక్షన్ హల్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి రైతుల సమస్యలపై ఎమ్మార్వోకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రు నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. వారి పెత్తనాల కోసం రైతు సమస్యలను గాలికి వదిలేసారని ఆరోపించారు. కృత్రిమ గొడవలు జరుపుతూ పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జోష్యం చెప్పారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్ధతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ ద్వారా టీఆర్ఎస్ నాయకులు, ప్రైవేటు, పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతున్నారన్నారు.
ధరణి పోర్టల్ కారణంగా పేద రైతులకు లాభం జరగకపోగా నష్టమే జరుగుతుందన్నారు. ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించినా నేటికీ హామీ అమలు కాలేదని గుర్తుచేశారు. వెంటనే రైతులపై ఉన్న రుణ భారాన్ని తొలగించాలన్నారు. పోడు భూములు చేసుకుంటున్న ఆదివాసి గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఆర్థికంగా సహాయం చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఏ రవిబాబు నాయకులు మెరుగు సత్యనారాయణ కొండపల్లి రఘురాం రెడ్డి, యుగేందర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి చంద్రారెడ్డి, రంగన్న గౌడ్, శ్యాములు శ్రీనివాస్, డిఎన్ జగదీష్, ఉపేందర్ గౌడ్, శ్రీనివాస్, యల్లావుల హరికృష్ణ, బాలు నాయక్, భూక్య శ్రీనివాస్, తారాచంద్, ఎర్ర శ్రీనివాస్, దేవ్ సింగ్ నాయక్, హనుమంతు, ఫకీర తదితరులు పాల్గొన్నారు.