BRS అభ్యర్థులకు వార్నింగ్.. పోల్ మేనేజ్‌మెంట్‌పై KTR స్కెచ్ ఇదే..!
అభ్యర్థులకు బీఆర్ఎస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: అభ్యర్థులకు బీఆర్ఎస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న తరుణంలో ఆశించిన మేరకు ప్రచారంలో స్పీడప్ లేదని, అసంతృప్తులను సైతం శాంతపర్చడంలో వైఫల్యం చెందుతున్నారని ఫైర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకటి కాదు, రెండు కాదు పాతిక నుంచి 30 మందిని గట్టిగా మందలించినట్లు తెలిసింది. నియోజకవర్గాల వారీగా వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను బట్టి, ప్రతి రోజూ ప్రగతిభవన్‌కు అభ్యర్థులను పిలిచి, రిపోర్టుల ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తున్నది. నేరుగా మంత్రి కేటీఆర్ డీల్ చేస్తున్నట్లు సమాచారం.
వేర్వేరు సంస్థల ద్వారా సర్వే
అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది పనితీరు మెరుగుపడలేదని సర్వేల్లో తేలడంతో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరో ఇరువై రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో సర్వేలను మరింత స్పీడప్ చేసింది. మరోవైపు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన వార్‌రూం ఇన్‌చార్జులను సైతం అలర్ట్ చేసింది. ఏ రోజుకారోజు డేటా ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఒకరిపైనే ఆధారపడకుండా పలు సంస్థల నుంచి రిపోర్టు తెచ్చుకొని సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఏయే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వెనుకబడింది, అందుకు గల కారణం, అభ్యర్థి పనితీరు, అసంతృప్తులను ఏ మేరకు శాంతిపజేశారనే వివరాలను సేకరిస్తున్నారు.
వీక్ క్యాండిడేట్స్‌కు కౌన్సెలింగ్‌తో పాటు
పలు సంస్థలు ఇచ్చే సర్వేలను గులాబీ బాస్ కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఏ సర్వే ఎలాంటి రిపోర్టులు ఇచ్చింది... ఇవ్వడానికి గల కారణాలు... ఆయా సంస్థలు ఏ పార్టీకి అయినా అనుబంధంగా పనిచేస్తున్నాయా అనే వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన రిపోర్టులను తిరిగి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగిస్తున్నట్లు సమాచారం. దాని ప్రకారం ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను పిలిపించుకొని ప్రచార సరళి, వెనుకబాటుకు గల కారణాలు, ఇతర పార్టీలు నిర్వహిస్తున్న ప్రచార వివరాలను చర్చిస్తున్నారు.
అంతేకాదు గత రెండు నెలల నుంచి ఏం చేస్తున్నారని అభ్యర్థులను తీవ్రంగా మందలిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఎందుకు అన్ని పార్టీలకంటే ముందుండటం లేదని ఫైర్ అవుతున్నట్లు తెలిసింది. అసంతృప్తులను బుజ్జగించడంలోనూ ఎందుకు చొరవ చూపడంలేదని, పార్టీ మారుతున్న అంశాన్ని సైతం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ తనదైనశైలిలో వీక్‌గా ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు సమాచారం.
కోవర్టు రాజకీయాలు
ఎన్నికల ప్రచారంలో వేడిని ఎలా పెంచాలని కేటీఆర్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారంలో ఎలా ముందుకు వెళ్లాలి... విమర్శనాస్త్రాలను సంధించడం, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనే అంశాలను వివరిస్తున్నారు. ఓటర్లను ఏ, బీ, సీగా వర్గీకరణ చేసి వారిని ఎలా ఆకట్టుకోవాలో చెప్పినప్పటికీ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మరోమారు కేసీఆర్ పోల్ మేనేజ్ మెంట్‌పై క్లాస్ ఇస్తున్నట్లు సమాచారం. చివరి రెండురోజులు ఓటర్లను ఎలా కలువాలి... వారి నుంచి ఎలాంటి భరోసా తీసుకోవాలి... పార్టీకి ఓటు ఎలా వేయించాలనేదానిపై ప్రణాళిక బద్ధంగా కేటీఆర్ వివరిస్తున్నారు. మరోవైపు ఇతరపార్టీలో అసంతృప్తితో ఉన్నవారిని అదేపార్టీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ కోవర్టు రాజకీయాలకు తెరతీస్తున్నట్లు సమాచారం.