యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : ఎస్పీ శబరీష్

మంగళవారం ములుగు జిల్లా జాకారం నందు జిల్లా ఎస్పీ

Update: 2024-09-24 15:46 GMT

దిశ, ములుగు ప్రతినిధి: మంగళవారం ములుగు జిల్లా జాకారం నందు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాలతో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ప్రతి మండలం నుండి గెలుపొందిన టీంలను ఎంపిక చేసి పోటీలను నిర్వహించారు. ఈ వాలీబాల్ పోటీలకు ముఖ్యఅతిథిగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గల యువత నైపుణ్యం ప్రపంచానికి తెలియాల్సి ఉందని, ఆటలను ఉల్లాసానికే కాకుండా భవిష్యత్తుగా కూడా తీసుకోవాలని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాల లో అవకాశాలు కూడా కల్పించడం జరిగినదని తెలియచేసారు.

ములుగు జిల్లా యువతని పోలీస్ శాఖ తరఫున కోరేది ఒకే విషయమని,మీ మీ గ్రామాలలో గంజాయిని అమ్మేవారు లేదా సేవించేవారు, ప్రభుత్వ స్థలాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారు ఉంటే వారి సమాచారాన్ని స్థానిక ఎస్సై, సీఐ అధికారులకు అందజేయాలన్నారు.పోటీలో ఒక జట్టు గెలవాలంటే ఆ జట్టులోని సభ్యులందరూ కలిసికట్టుగా ఎలా పోరాడుతారో ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే యువత,ప్రజలు, పోలీసులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడుతేనే విజయం సాధించగలుగుతామని, డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను నాశనం చేస్తుందని దేశానికే వెన్నెముక అయిన యువతను కబలిస్తున్న ఈ డ్రగ్స్ ను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో ములుగు ఓ ఎస్ డి మహేష్ బిగితే, అదనపు ఎస్పీ ఏ ఆర్ సదానందం, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్ఐలు పాల్గొన్నారు.


Similar News