న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో కమల వికాసమేది?

న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ‌లం వికాసం ఆదిలోనే వాడిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు చాలా బ‌లంగా ఉన్నాయి.

Update: 2023-05-25 03:15 GMT

దిశ, నర్సంపేట: న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ‌లం వికాసం ఆదిలోనే వాడిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు చాలా బ‌లంగా ఉన్నాయి. రేవూరి వంటి సీనియ‌ర్, రాణా ప్రతాప్‌రెడ్డి వంటి యువ‌నేత చేరిక‌తో బీజేపీ సైతం రేసులోకి వ‌చ్చేసింది. అయితే కొద్దిరోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం పార్టీకి న‌ష్టం క‌లిగించే విధంగా ఉండ‌డమే కాకుండా బ‌లపేత‌మ‌య్యే అవ‌కాశాల‌ను స‌న్నగిల్లేలా చేస్తున్నాయ‌న్న వాద‌నలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్యాడర్‌ను సంసిద్ధుల్ని చేసే విషయంలో నేతలకు స్పష్టత కొరవడడం ప్రధాన లోపంగా మారుతోంద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పట్ల స్పందించాల్సిన నాయకులు అ ప్రధానమైన అంశాల పట్ల ఆసక్తిని కనపరుస్తుండడంతో నియోజకవర్గంలో పార్టీ అబాసు పాలవుతోంది.

ఎన్నికల వేళ స్తబ్దత..

నర్సంపేట డివిజన్‌లో ఏడాదిన్నర కాలంగా బీజేపీ క్రమక్రమంగా తమ కార్యకర్తలను పెంచుకుంటూ వస్తోంది. అధికార పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతతో మొదట్లో కమలం జోరు మొదలైంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి బీజేపీకి ఆదరణ లభించింది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ తన క్యాడర్‌ను పొగుచేసుకుంది. ఇది గడచి దాదాపు ఆరు నెలలైంది. కొన్ని నెలల వరకు మంచి ఊపులో కనపడిన ఆ పార్టీలో అనుకోని విధంగా స్తబ్దత మొదలైంది. అధికార పార్టీని ప్రశ్నించాల్సిన సమయంలో బాధ్యతలు మర్చి తిరోగమన దిశలో పయనిస్తోంది. సవ్య, అపసవ్య మార్గాల్లో దేన్నీ తేల్చుకోలేని స్థితిలో క్యాడర్ మునిగిపోయింది. ఈ క్రమంలో డివిజన్ వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నెలకొంటుంది.

చేరిన వారికి ప్రాధాన్యం కరువు..

కొన్ని నెలలుగా పార్టీలో చేరుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా అధికార, కాంగ్రెస్ పార్టీల నుంచి గతంలో కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇలా చేరిన వారిలో దాదాపు కార్యకర్తలే ఉండటం, ఏ మండలం నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు లేకపోవడం గమనార్హం. చేరిన వారికి స్థానికంగా ఉహించినంత ఆదరణ నాయకుల నుంచి లేకపోవడం ఒకింత అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం. నాయకుల స్థాయి వ్యక్తులకు దక్కే గౌరవాన్ని సాధారణ కార్యకర్తలు ఆశిస్తుండడంతోనే సమస్య ఉత్పన్నం అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా నర్సంపేటలో ఏర్పడిన రెండు వర్గాలతోనే కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిపోతున్నది. కొత్తగా బీజేపీలో చేరాలనుకునే వారు సైతం వెనుకడుగు వేసేలా పరిస్థితులు మారిపోయాయి.

గ్రామాల్లో కనిపించని ప్రభావం..

బీజేపీ తన క్యాడర్‌ను మండల కేంద్రాల్లోనే పెంచుకుంటూ వస్తున్నది. యువతను ఎక్కువగా ఆకర్షించడం ఆ పార్టీ బాధ్యులు సఫలమయ్యారు. మండల స్థాయి, గ్రామస్థాయిలో చేరికలు మొదలైనప్పటికీ పార్టీ ప్రభావం గ్రామాల్లో కనిపించడం లేదు. గ్రామస్థాయిలో సమస్యలను ఆ పార్టీ నేతలు విస్మరించడమే క్యాడర్ పెరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ఏడాది కాలంగా నర్సంపేట డివిజన్‌లో బీజేపీకి అనుకూల పరిస్థితులు వచ్చాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా, ప్రశ్నించేలా, ప్రజలకు న్యాయం జరిగేలా ఏ ఒక్క సమస్యను బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదు.

వడగండ్ల వర్షం తో డివిజన్ వ్యాప్తంగా నష్టం జరిగింది. నష్టపోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. దాదాపుగా చాలా గ్రామాల్లో అర్హులకు పూర్తిస్థాయిలో చెక్కులు రాలేదు. ఈ రెండు అంశాలను బీజేపీ నాయకులు సరిగ్గా వాడుకోలేదు. గ్రామ స్థాయిలో ప్రజలకు దగ్గరయ్యే మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు. సమస్యలపై కాకుండా శుభకార్యాలకు హాజరవడం పైనే దృష్టి పెట్టడం విమర్శలకు తావిస్తోంది.

అభ్యర్థి తెల్వకపోవడం మైనస్సేనట..!

ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నర్సంపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే దానిపై కార్యకర్తల్లోనే స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ విషయంపై అధికార పార్టీ కార్యకర్తలతో నిత్యం వాగ్యుద్ధం నడుస్తూనే ఉంది. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, యువ నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్యులు. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం రేవూరిది. నర్సంపేట అభివృద్ధికి సైతం కారణం ఎవరంటే రేవూరే అనే సమాధానం ఇప్పటికీ జనాల్లో ఉంది. యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత. గతేడాది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరారు. పెద్ద ఎత్తున యువత బీజేపీలో చేరడంలో ఆయన పాత్ర కీలకం. కాగా, వీరిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్న విషయంపై స్పష్టత కరువైంది.

మా నాయకుడంటే మా నాయకుడే అభ్యర్థి అని పోటాపోటీగా సోషల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. ఈ పరిస్థితులే నర్సంపేటలో బీజేపీ క్యాడర్ అనుకున్నంతగా పెరగక పోవడానికి కారణమని ఆ పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరువురి మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రజా సమస్యలపై దృష్టి సారించట్లేదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఒక పార్టీలోనే రెండు వర్గాలు కావడంతో తాము ఏ వైపు అనేది తేల్చుకోలేని పరిస్థితిలో కార్యకర్తలు ఉన్నారు. కొత్తగా చేరే వారిపై కూడా ఈ ప్రభావం పడుతున్నది. త్వరలోనే ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం రాష్ట్ర నాయకత్వం చేపట్టకపోతే నర్సంపేటలో కమల వికాసం కలగానే మిగిలిపోనుంది.

Tags:    

Similar News