లొంగిపోయిన మావోయిస్టు కుటుంబాలకు అండగా ఉంటాం : జిల్లా ఎస్పీ
టీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న "పోరు కన్నా ఊరు మిన్న-మన ఊరికి తిరిగి రండి"
దిశ, ములుగు ప్రతినిధి: టీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న "పోరు కన్నా ఊరు మిన్న-మన ఊరికి తిరిగి రండి" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ జిల్లాలోని పలువురి మావోయిస్టు నాయకుల కుటుంబాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు నేతలు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తోపాటు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబ స్థితిగతులను తెలుసుకొని నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ… మావోయిస్టు లు వనం వీడి జనంలోకి రావాలని, మావోయిస్టుల్లో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల, ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమం చివరి స్థాయికి చేరిందని అన్నారు. మావోయిస్టు నేతలు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన మావోయిస్టు కుటుంబాలకు పోలీసులు అండగా ఉంటారని, లొంగిపోయిన వారికి పునరావాసం కింద రూ. 20 లక్షల రివార్డుతో పాటు నివాసానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పోలీసుల ఎదుట లొంగిపోయేల సహకరించాలన్నారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టుకు అండగా ఉంటామన్నారు.