అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరుస్తాం : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ప్రభుత్వం లో ఏడాదిలోగానే రాష్ట్రంలో 4.5 లక్షల
దిశ, వరంగల్ బ్యూరో : ఇందిరమ్మ ప్రభుత్వం లో ఏడాదిలోగానే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని ఉమ్మడి వరంగల్ ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు చేస్తూ, 4 సంవత్సరాల లో 80 లక్షల ఇళ్ల నిర్మించే లక్ష్యం గా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదోడి కల నెరవేర్చాలని దృఢ సంకల్పం తో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, దొంతి మాధవరెడ్డి, కె ఆర్ నాగరాజ్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, కుడా చైర్మన్ ఇనుగా వెంకటరామిరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి హన్మకొండ వరంగల్ జిల్లాలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పురోగతి, భద్రకాళి చెరువు పూడికతీత అభివృద్ధి తదితర అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటూ పనులు కొనసాగించాల్సిన తీరుపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ సంబంధించి 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్నిదని అన్నారు. గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని కలలు కలలుగానే ఉంచిందన్నారు. ఇళ్ల నిర్మాణం చేసి మొండిగా వదిలేసిందన్నారు. జనవరి 31 లోగా అత్యంత పారదర్శకంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు.
కొత్తవాళ్లు ఎంపీడీవోకు దరఖాస్తు చేయాలి..
ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులకు అర్హులైన పేదలకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క పేదవాడు కూడా అభద్రతకు లోను కావద్దని, రాజకీయాలకతీతంగా నిరుపేదలకు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకొని అర్హులైన వారు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు యాప్ లో నమోదు చేస్తారని అన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలేసిన 1.5 లక్షల ఇళ్లను కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రజా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకోగా , ఇంటింటికి సర్వే నిర్వహించి ఇప్పటికే 65 లక్షల మంది వివరాలు ఆప్ ద్వారా సేకరించామని తెలిపారు. గతంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను అర్హులకు కేటాయించి తలుపులు, మరమ్మతులకు అయిన ఖర్చు చెల్లిస్తామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల 65 వేల మంది రైతులకు రూ .22 వేల కోట్ల 2 లక్షల లోపు రుణమాఫీ చేశామని అన్నారు.
జనవరి 26 నుంచి రైతు భరోసా అందజేస్తాం..
రైతు భరోసా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ పర్యటించి రైతుల నుండి అభిప్రాయాలు సేకరించామని మంత్రి పొంగులేటి తెలిపారు. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి వ్యవసాయ యోగ్యత గల భూమికి ప్రతి సంవత్సరం ఎకరాకు రైతు భరోసా క్రింద 12 వేల రూపాయలు అందిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా భూమిలేని పేద వ్యవసాయ కూలీలకు రూ 12 వేలు చెల్లిస్తామని అన్నారు. వరి పండించే రైతులకు భరోసా కల్పించే విషయంలో సన్న వడ్లకురూ. 500 బోనస్ ను ప్రభుత్వం ఇస్తుందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల లో కేవలం 108 వేల రేషన్ కార్డులు మంజూరు చేసి కొన్ని తొలగించిందని అన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.
వరంగల్ అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం..
ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత వరంగల్ పట్టణం వరంగల్ ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించారని అన్నారు. హైదరాబాద్ తర్వాత హైదరాబాద్‌కు సమానంగా పాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు. అందుకు అనుగుణంగానే మొదటి సంవత్సరం పూర్తి కాకముందే సీఎం రెండు పర్యాయాలు వరంగల్ పట్టణానికి వచ్చారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి పర్యటన సందర్భంగా చేయాల్సిన అభివృద్ధి పై స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి అభిప్రాయాలను తీసుకొని ఎయిర్పోర్ట్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని భావించారని అన్నారు.
ఆ లక్ష్యంతో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా తనకు బాధ్యతలు అప్పగించారని అన్నారు. రెండో పర్యాయం వరంగల్‌కు వచ్చినప్పుడు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని, 6 వేల కు పైగా వరదలాగా నిధులు మంజూరు చేశారని అన్నారు. 2041 మాస్టర్ ప్లాన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. భద్రకాళి చెరువు పూడికతిత, వివిధ అభివృద్ధి, మౌలిక వసతులు కల్పన టెండర్లు పిలిచామని అన్నారు. హైదరాబాదులో లాగా వరంగల్ లో కూడా కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకున్నామని, సంక్రాంతిలోపు రెండో విడతలో మరికొన్ని ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దేశంలో టీజీఆర్టీసీని మోడల్ గా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ శాఖను మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.