దిశ, ములుగు ప్రతినిధి: ములుగు గడ్డపై బీజేపీ జండా ఎగిరేలా చేయాలని కేంద్ర సహకార ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి బిఎల్ వర్మ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో గల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మహాజన్ సంపర్క్ యోజన కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ నాయకుల సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ పాలనను క్షేత్రస్థాయిలో వివరించాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులను సన్మానించడం తనకు దక్కిన గొప్ప వరమని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశం నిరంతరం కొత్త రికార్డులను సృష్టిస్తూ ప్రపంచానికి దారి చూపుతోందన్నారు. దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని స్పష్టం చేశారు. బీజేపీ పదాధికారులు ఏదైనా కారణాలతో మనస్పర్థలతో అలిగిన పూర్వ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే పని చేపట్టాలని మంత్రి సూచించారు. డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ములుగు నియోజకవర్గ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ నాయకులతో మంత్రి సహాబంతి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జులా ప్రేమిందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు కట్ట సుధాకర్ రెడ్డి, ములుగు జిల్లా ఇన్చార్జి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణి నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, రాష్ట్ర రీఛార్జ్ అండ్ పాలసీ భూక్య రాజు నాయక్, నియోజకవర్గ కన్వీనర్ సిరికొండ బలరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, అధికార ప్రతినిధి డి. వాసుదేవ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.