నిమజ్జన వేళ ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

వరంగల్, హన్మకొండ, ఖాజీపేట ట్రై సిటీ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు.

Update: 2024-09-15 14:48 GMT

దిశ, వరంగల్ : వరంగల్, హన్మకొండ, ఖాజీపేట ట్రై సిటీ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. దాంతో నగరంలో పెద్ద స్థాయిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకుగాను ట్రై సిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. ట్రాఫిక్ అంక్షల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి మంగళవారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు...

ములుగు, భూపాలపల్లి వైపు నుండి వచ్చే భారీ వాహనాలు హైదరాబాద్ కు వెళ్లాల్సినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి వెళ్లాలని, భూపాలపల్లి పరకాల నుండి ఖమ్మం వెళ్లాల్సిన ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుండి వెళ్లాలన్నారు. భూపాలపల్లి, పరకాల నుండి వచ్చే భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్లాల్సినవి కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్ పిరీలు, గొర్రెకుంట నుండి వెళ్లాలన్నారు. సిటీ లోపలికి వచ్చే భారీ వాహనాలు సిటీ అవతల ఆపుకోవాలని, లోపలికి అనుమతించరని పేర్కొన్నారు.

వరంగల్ నగరంలో తిరిగే వాహనాలకు....

ములుగు, పరకాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కేయూసీ, సీపీఓ, అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండుకు చేరుకోవాల్సి ఉంటుందని, హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి ములుగు వైపు, కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సీపీఓ ద్వారా కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్తాయన్నారు.

    హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్తాయని, వరంగల్ బస్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జి నుండి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలన్నారు.

వినాయక నిమజ్జన వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు...

సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం చేసే విగ్రహాలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఉండి ట్రాక్టర్, టాటా ఏస్​లలో వచ్చే వాటిని మాత్రమే అనుమతించనున్నట్టు, ఆ శోభాయాత్ర హంటర్ రోడ్, అదాలత్, సీపీఓ, హన్మకొండ చౌరస్తా, బాలాంజనేయ స్వామి టెంపుల్ మీదుగా వెళ్లి నిమజ్జనం అనంతరం వయా శాయంపేట మీదుగా తిరిగి వెళ్లాలన్నారు. హనుమకొండకు చెందిన భారీ వినాయక విగ్రహాలు కోట చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనంకు వెళ్లాలని కోరారు.

     ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుండి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయాలన్నారు. చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసే విగ్రహాలు కాశిబుగ్గ, పోచమ్మ మైదాన్, దేశాయిపేట మీదుగా వెళ్లి నిమజ్జనం అనంతరం వయా ఏనుమాముల మార్కెట్ నుండి కాశిబుగ్గ మీదుగా తిరిగి వెళ్లాలని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

Tags:    

Similar News