నల్లబెల్లి మండలంలో పులి సంచారం..!
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగుడెం నుండి
దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగుడెం నుండి కొండాపురం వెళ్లే పరిసరాల్లో పులి సంచారం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అడుగు ముద్రలను సైతం గుర్తించడంతో మండలం లో చర్చ జరుగుతోంది. పులి సంచారానికి సంబంధించి భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
హైనా గా అనుమానం..!
నల్లబెల్లి మండలంలోని రుద్రగుడెం నుండి కొండాపురం వెళ్లే వైపుగా గల ఓ భూమిలో రుద్రగుడెం గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చి తోట సాగుచేస్తున్నాడు. పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లగా మిర్చి తోట లో పులి అడుగులను చూసినట్లు గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పులి సంచారం అంటూ చర్చ మొదలైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సదరు రైతు తీసిన ఫోటోలను చూసి హైనా కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు.
క్యాట్ జాతికి చెందిన పులి అడుగులు 10-12 ఇంచులు ఉంటాయని, పులి నడిచేటప్పుడు కాలి గోళ్లను వెనక్కి వంచుతుందన్నారు. గోళ్ళ ముద్రలు పడకుండా కేవలం అడుగు ముద్ర మాత్రమే పడుతుందన్నారు. డాగ్ జాతికి చెందిన హైనా నడిచేటప్పుడు గోళ్ల ముద్రలు కూడా పడతాయని స్పష్టం చేస్తున్నారు. హైనాలు గుంపులు గుంపులు గా తిరుగుతాయని, వీటితో చిన్న పిల్లలకు మాత్రమే ప్రమాదకరం అని అన్నారు. ఘటనాస్థలికి వెళ్లి పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామన్నారు.