ఏనుమాముల మార్కెట్‌లో దొంగలు.. రైతు మిర్చి బస్తా మాయం!
వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌లో అధికారుల
దిశ,వరంగల్ టౌన్ : వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌లో అధికారుల నిర్లక్ష్యం,సిబ్బంది అలసత్వం కొనసాగుతోందని కొన్నేళ్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. అయినా అధికారుల తీరులో సిబ్బంది నిర్వాకం లో మాత్రం మార్పు రావడం లేదు. రైతులకు, వారి సరుకుల రక్షణలో మరోసారి లోపం తేటతెల్లమైంది. సోమవారం ఓ రైతు సరుకులో ఒక బస్తా మాయం కావడం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. శుక్రవారం ఓ రైతు వరంగల్ ట్రేడర్స్ తరపున మార్కెట్‌కు 51 బస్తాల మిర్చి తీసుకొచ్చాడు. ఆ రోజు మార్కెట్‌లో మిర్చికి ధర లేదనే కారణంతో రైతు సరుకు విక్రయానికి అంగీకరించలేదు.
దీంతో సరుకును మార్కెట్ ఆఫీసు ఎదురుగా గల మిర్చి యార్డులోనే భద్రపరిచాడు. అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి విషయాన్ని చెప్పాడు. తీరా సోమవారం మార్కెట్‌కు వచ్చిన వరంగల్ ట్రేడర్ గుమస్తా సరుకు లెక్కబెడితే ఒక బస్తా తక్కువ వచ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నిస్తే.. తమకేమీ తెలియదంటూ చేతులెత్తేశారు. దీంతో రైతు లబోదిబోమంటూ ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కూడా... ఇదే రైతుకు సంబంధించిన మూడు మిర్చి బస్తాలు పోయాయని ట్రేడర్ దిశ దినపత్రికకు చెప్పుకొచ్చారు.ఇవే కాకుండా మార్కెట్‌లో గతంలో రైతుల సరుకు మాయమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని తాజా సంఘటనే నిదర్శనం. ఇదొక్కటే రైతులు తీసుకొచ్చిన సరుకును దౌర్జన్యంగా బస్తాల్లో నుంచి తీసుకున్న సంఘటనలు లేకపోలేదు.
రోజుకు రూ.4 లు..
అనివార్య కారణాలతో రైతులు తమ సరుకును మార్కెట్‌లోనే ఉంచాల్సి వస్తే.. రోజుకు బస్తా ఒకొక్కటికి రూ.4 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఆ రుసుము సెక్యూరిటీ సిబ్బందికి చెల్లిస్తారని చెబుతున్నారు. అలా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న... సరుకు మాయమవడం విస్మయం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, మాయమైన బస్తాకు డబ్బులు చెల్లించేలా లోపాయికారిగా చర్యలు చేపట్టడం వెనక ఆంతర్యమేమిటో? రైతుల సరుకుకు రక్షణ లేకపోవడం ఏమిటో? అర్థం కాని పరిస్థితి నెలకొందని పలువురు బాహాటంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, కలెక్టర్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.