పర్యవేక్షణ పడకేసింది.. అధ్వాన్నంగా ఏనుమాముల మార్కెట్‌ నిర్మాణ పనులు

ఏనుమాముల మార్కెట్‌లో కొనసాగుతున్న కొత్త నిర్మాణాల పనుల్లో పర్యవేక్షణ కొరవడింది.

Update: 2024-01-18 02:01 GMT

ఏనుమాముల మార్కెట్‌లో కొనసాగుతున్న కొత్త నిర్మాణాల పనుల్లో పర్యవేక్షణ కొరవడింది. రూ.లక్షలు పోసి సొంతంగా ఇల్లు కడుతుంటే పనిచేసే వాళ్లు ఎలా చేస్తున్నారో ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తుంటాం. అదే కోట్లు ఖర్చు చేసి పలు నిర్మాణాలు చేపడుతుంటే ఇక ఎలా ఉండాలి. అనుక్షణం పనులు పరిశీలిస్తూ ఉండాలి. కానీ, ఏనుమాముల మార్కెట్‌ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. తమ సొంత డబ్బు కాదనుకుంటున్నారో ఏమో గానీ పనుల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పాలకవర్గం ప్రతిపాదించిన పనులతో మాకేం సంబంధం అనుకుంటున్నారో ఏమో నాణ్యతను పరిశీలించే వారే కరువయ్యారు. మిర్చి యార్డులో కొత్తగా రేకులు వేశారు. అందుకు రూ.4.44 కోట్లు ఖర్చు చేశారు. కానీ, అవి వేసిన చోటే ప్రశ్నార్థకంగా మారింది. రేకులు వేసిన స్లాబులు శిథిలావస్థకు చేరుకుని ఇనుపచువ్వలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల స్లాబు పెచ్చులు కూడా ఊడిపోయాయి. అయినా వాటిపైనే రేకులు వేయడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాక అపరాల యార్డులో సబ్ ఆఫీస్, టాయిలెట్ల నిర్మాణం, పసుపు, పల్లి యార్డులో రేకులషెడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నీ గత పాలకవర్గం హయాంలో ప్రతిపాదించగా ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మార్కెట్‌ అధికారులు పనుల తీరును పర్యవేక్షించిన దాఖలాలు లేవని మార్కెట్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. - దిశ, వరంగల్‌ టౌన్

దిశ, వరంగల్‌ టౌన్ : రూ.లక్షలు పోసి సొంతంగా ఇల్లు కడుతుంటే పనిచేసే వాళ్లు ఎలా చేస్తున్నారో ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తుంటాం. అదే రూ.కోట్లు ఖర్చు చేసి పలు నిర్మాణాలు చేపడుతుంటే ఎలా ఉండాలి. అనుక్షణం ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండాలి. కానీ, ఏనుమాముల మార్కెట్‌ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. తమ సొంత డబ్బు కాదనుకుంటున్నారో ఏమో గానీ పనుల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పాలకవర్గం ప్రతిపాదించిన పనులతో మాకేం సంబంధం అనుకుంటున్నారో ఏమో నాణ్యతను పరిశీలించే వారే కరువయ్యారు.

కూలిపోయే వాటిపైనే కొత్త రేకులు..

మిర్చి యార్డులో కొత్తగా రేకులు వేశారు. అందుకు రూ.4.44 కోట్లు ఖర్చు చేశారు. మార్కెట్‌కు వచ్చే సరుకులు ఎండకు ఎండకూడదనో, వానకు తడవకూడదనో అధికారులు లేదా పాలకవర్గం ముందుచూపో గానీ రేకులు వేయడం మంచి పనే. కానీ, అవి వేసిన చోటే ప్రశ్నార్థకంగా మారింది. రేకులు వేసిన స్లాబులు శిథిలావస్థకు చేరుకుని ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల స్లాబు పెచ్చులు కూడా ఊడిపోయాయి. అయినా, వాటిపైనే రేకులు వేయడం వెనుక అధికారులు, పాలకవర్గం ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

కొరవడిన నాణ్యత..

మరోవైపు అపరాల యార్డులో సబ్ ఆఫీసుకు రూ.47 లక్షలు కేటాయించారు. రూ.22 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం జరుగుతోంది. పసుపు, పల్లి యార్డులో కూడా రూ.2.93 కోట్లతో రేకుల షెడ్డు (ప్రీ పేయింటెడ్ గాల్ వాల్యూమ్ షీట్ల) నిర్మాణ పనులు చేపడుతున్నారు. అలాగే మార్కెట్ రెండో గేట్ వద్ద రూ.9 లక్షలతో ఎడ్లబండి, రైతు విగ్రహాలు, రూ.29 లక్షలతో ఆర్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ పనులన్నీ గత పాలకవర్గం హయాంలో ప్రతిపాదించారు. పాలకవర్గం కాలపరిమితి ముగిశాక పనులు ప్రారంభమై ఇంకా కొనసాగుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ పనుల్లో నాణ్యత కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాసిరకం ఇసుక, నాణ్యత లేని సిమెంట్‌ వినియోగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కావస్తున్నాయి. అయినా.. మార్కెట్‌ అధికారులు పనుల తీరును పర్యవేక్షించిన దాఖలాలు లేవని మార్కెట్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కనిపించని కాంట్రాక్టర్‌.. స్పందించని డీఈ

అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందామనే ప్రయత్నంలో మార్కెట్‌ డీఈకి ఫోన్‌ చేసినా ఎత్తే పరిస్థితి లేదు. మూడు, నాలుగు రోజులుగా ఫోన్‌ చేస్తున్నా.. ఆయన ఫోన్‌ ఎత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పనులు సాగుతున్న విషయం ఆయనకు తెలియదనుకోవాలో.. వాటి పర్యవేక్షణ అధికారులకు సంబంధం లేదనుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇప్పటివరకు కాంట్రాక్టర్‌ వచ్చింది లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్లు సూపర్‌వైజర్లు, మేస్త్రీలకు పనులు అప్పగించి.. చేతులు దులుపుకున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో పనులను పర్యవేక్షించే వారు లేకపోవడంతో మేస్త్రీలు, సూపర్‌వైజర్లు తమకు నచ్చిన సరుకులు, తక్కువ ధరకు దొరికే మెటీరియల్‌ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్‌ పనులను పర్యవేక్షించి, ఖర్చు చేస్తున్న ప్రజాధనానికి తగిన న్యాయం చేస్తారో.. లేదా తమకు ముట్టేది ముట్టింది.. ఎవరెక్కడ పోతే ఏంటని చేతులు ముడుచుకుని కూర్చుంటారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News