ఆ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నా.. కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు.
దిశ, జనగామ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో బ్రహ్మాండమైన మెజారిటీ అందించారని అన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే గా ఉంటే అభివృద్ధి, పరిపాలన సజావుగా ఉంటుందనే ఎవరెన్ని విమర్శలు చేసినా, పరోక్షంగా ఓడించాలని చూసినా ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నానని ఆయన అన్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి పై చర్చించినట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతీ రిప్రజెంటేషన్ పై సానుకూలంగా స్పందించారని తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గంగా, పేద ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గంగా ఉందని అన్నారు. గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో రాజకీయ అవినీతి, అక్రమాలు రాజకీయం అంటే పదవులు, పథకాలు అమ్ముకోవడం అనే విధంగా చేశారని అన్నారు. కానీ ఇప్పుడు రాజకీయం అంటే సంక్షేమం, ప్రజా సేవ, నీతి నిజాయితీ అనే కొత్త నిర్వచనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే నిజాయితీగా పని చేస్తూ రూపాయి ఆశించకుండా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కష్టపడి పని చేసే వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి రావాలంటే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని దానికి నిధులు, ఆర్టీసీ ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని అన్నారు. అలాగే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది కాని కార్యాలయాలు లేవని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు కోరగానే సానుకూలంగా సీఎం స్పందించారని అన్నారు.
వీటన్నింటికి త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయని, నవంబర్ నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని శాసనసభా పక్షాలను విలీనం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. కోర్టుల పైన గౌరవం ఉందని, కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని తెలిపారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చాలా చూశానని అన్నారు. స్థాయిలేని మనుషుల గురించి తాను మాట్లాడనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.