'కుళ్ళిన కూరగాయలు.. ముక్కిన బియ్యం'.. సంక్షేమ హాస్టళ్లలో ఆకలి కేకలు

Update: 2023-09-30 13:31 GMT

దిశ, రేగొండ : గురుకులంలో వసతి గృహాల్లోని వంటశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని రోడ్డెక్కిన విద్యార్థినిల తల్లిదండ్రులు. ఈ ఘటన మండలంలోని లింగాల క్రాస్ వద్ద ఉన్న గురుకులంలో చోటు చేసుకుంది. చెడిపోయిన కూరగాయలతో.. పురుగులు బియ్యంతో వండి పెడుతున్నారని.. చారుకాసే పప్పు, ఇతర దినుసులు నాణ్యంగా ఉండటం లేదని.. వంటలన్నీ ఉడికీ ఉడకకుండా ఉంటున్నాయన్న ఆరోపణలున్నాయి. వంట మనుషులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలున్నాయి.


కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా వంట మనుషులు, ఇతర సిబ్బందిపై చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. శనివారం పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. మధ్యాహ్న భోజన సమయంలో పేరెంట్స్ వంట గది పరిసరాలను పరిశీలించారు.


కుళ్ళిపోయిన కోడి గుడ్లు, ఉడికి ఉడకని అన్నం, ఉడకపెట్టిన టమాట కూర వారికీ తారస పడ్డాయి. అంతే కాకుండా రేపటి కోసం తీసుకు వచ్చిన కూరగాయలు కూడా నాణ్యత లేకపోవడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు రోడ్డుపై బైటాయించి ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ ఆశీర్వాద్ వచ్చి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.


Similar News