దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఈసం వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్ పట్టించుకోవడం లేదని, అధికారుల పని ఒత్తిడి తనపై పడుతుందని వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్ రాసి శుక్రవారం తన స్వంత గ్రామం బయ్యారం మండలం ఇర్సులాపురంలో తన ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు, అధికారులు అతన్ని మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న తరుణంలో పంచాయతీ లో జరిగే కార్యక్రమాలకు సర్పంచ్ కుర్సం మాధవి, ఉప సర్పంచ్ తొగరు కొమురయ్య అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు. అయితే బాదితుడు వెంకటేశ్వర్లు తన భార్య సుభద్రతో ఆర్థిక సమస్యల గురించి ముచ్చటించే వాడని అతడి భార్య తెలిపింది .
పంచాయతీ అభివృద్ధికి తన చుట్టు పక్కల వారి వద్ద నుండి అప్పులు తెచ్చి అభివృద్ధి పనులకు ఖర్చు చే సేవాడని, కానీ వాటి బిల్లులు తీసుకునేందుకు ఉపసర్పంచ్ సహకరించకుండా బిల్లులపై సంతకం పెట్టకుండా ఇబ్బంది పెట్టేవాడని సుభద్ర తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.