కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చాలి :కేసీఆర్
అమలు చేయలేని హామీలతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.
దిశ, వరంగల్ బ్యూరో : అమలు చేయలేని హామీలతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. హామీలను గుప్పించి.. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క హామీని సైతం కాంగ్రెస్ అమలు చేయకుండా తప్పించుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో పాలన బాగుండాలంటే తెలంగాణ ప్రజలు తరుపున కొట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలని అన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి.. పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రోడ్ షో ఆదివారం సాయంత్రం హన్మకొండకు చేరుకుంది.
హన్మకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా వరంగల్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. గత 20 ఏళ్లుగా సుధీర్‌కుమార్ తనతో పాటు ఉద్యమంలో, పార్టీలో పనిచేస్తూ వస్తున్నారని అన్నారు. వరంగల్ జిల్లా అంటేనే పోరుగల్లని.. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందని అన్నారు. కాళోజీ నారాయణరావు, జయశంకర్‌సార్‌లను గుర్తుంచుకోవాలని అన్నారు. వరంగల్ జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఈ మట్టిని ఈ నేలను మరువలేనని అన్నారు.
సమైక్య పాలనలో వరంగల్ జిల్లా ఎంతో వెనకబడిందని, ఆజాం జాహి మిల్లు ఆగమైందని అన్నారు. బీఆర్ఎస్ పాలన కాలంలో వరంగల్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎంజీఎం మల్టీసూపర్ స్పెషాలిటీ నిర్మాణం, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఈ అభివృద్ధికి ప్రజలే సాక్ష్యమని అన్నారు.
చిత్ర విచిత్రంగా సీఎం మాటలు..
రాష్ట్ర పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేకుండా సీఎం మాట్లాడుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసలు కాళేశ్వరం నీళ్లే వరంగల్‌కు, రాష్ట్రాంలోని ఆయా ప్రాంతాలకు రాలేదని ప్రచారం చేస్తున్నాడని అన్నారు. అయితే నర్సంపేట, భూపాలపల్లి, వరంగల్, జనగామ జిల్లాల్లోని జలశయాలకు వచ్చింది నిజం కాదా..? అన్నది ప్రజలకు తెలియదా ? అంటూ ప్రశ్నించారు. బ్రహ్మండమైన పంటలు పండింది నిజం కాదా..? అంటూ ప్రశ్నించారు. కృష్ణా నది కూడా నేనే కట్టిన అంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు... ఎవడైనా నదిని కడుతారా..? ఆయన తెలివి ఆవిధంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసింది. గోల్‌మాల్ చేసింది. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. రైతుబంధు, రైతు భీమా ఎవరికి రాలే... ప్రజలకు ప్రతీ మహిళకు 2500 ఇస్తామని చెప్పారు.. ఎంతమందికి ఇచ్చారని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తామన్నారు. ఇప్పటి వరకు చేయలేదని అన్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగి ఉండే.. ఇప్పుడు ఆ భూం మొత్తం పోతోందన్నారు. రియల్ వ్యాపారంపై బత్రికేవాళ్లంతా రోడ్లపై పడ్డారని అన్నారు.టీఎస్ బీపాస్ ద్వారా నిర్మాణాలకు అనుమతులిచ్చేవాళ్లం, కానీ నేటి ప్రభుత్వం అనుమతులన్నీ ఆపేసింది.. దీంతో ప్రజలు, వ్యాపారులు ఆగమవుతున్నారని అన్నారు.
బీజేపీతో దేశానికి ప్రమాదకరం
బీజేపీ పార్టీతో ఈ దేశానికి ప్రమాదమేనని కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ ప్రజల కష్టసుఖాలతో సంబంధం లేకుండా పనిచేస్తుందని అన్నారు. యువతను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. మోదీ వంద నినాదాలు చెప్పిండు.. ఒక్కటి కూడా ప్రజలకు నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. నల్లధనాన్ని తెస్తాను.. రూ.15లక్షలు ఇస్తానని చెప్పిండు.. కనీసం 15 రూపాయలు కూడా పేదలకు పంచలేదన్నారు.
కాజీపేటకు వచ్చిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయాడని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు పదేళ్లు సమయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. గోదావరి నది తీసుకుపోతానంటూ నరేంద్రమోదీ చెబుతున్నాడు.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటుండు... ఇందులో మతలబేంటో ప్రజలు గ్రహించాలన్నారు. గోదావరి ఎత్తుకపోతానంటే సీఎం మూతి ముడుచుకుని కూర్చుంటున్నాడని అన్నారు. నరేంద్రమోదీ కూడా 250 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని, తెలంగాణలో పార్లమెంటు సీట్లన్నీ బీఆర్ ఎస్ పార్టీ గెలిస్తే.. 14 సీట్లు గెలిస్తే కేంద్రంలో హంగ్ ఏర్పడితే.. బీఆర్ ఎస్ పార్టీ కీలకమవుతుందని అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ గెలుపే తెలంగాణ రాష్ట్రానికి శ్రేయస్కరమని అన్నారు.
ఉప ఎన్నిక గ్యారంటీ... రాజయ్యే ఎమ్మెల్యే..!
వరంగల్ బీఆర్ ఎస్ టికెట్ కడియం కూతురుకు కేటాయింపు చేశాక రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన శ్రీహరిపై పెద్దగా మాట్లాడబోనని అన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్‌ను తనకు తానుగా సమాధి చేసుకున్నారని అన్నారు. మూడు నెలల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నిక వస్తుందని, అక్కడ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని అన్నారు.