సేల్ ఫర్ లేబర్ కార్డ్స్!
అసంఘటిత కార్మికులకు బీమా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న లేబర్ కార్డ్ పథకం గాడి తప్పుతోంది.
దిశ, వరంగల్ బ్యూరో : అసంఘటిత కార్మికులకు బీమా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న లేబర్ కార్డ్ పథకం గాడి తప్పుతోంది. కార్మికుల కుటుంబాలకు ఆర్థిక, సంక్షేమాన్ని కలిగించే ఉద్దేశంతో అమలు చేస్తుండగా, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చనిపోయిన వారిపేరిట లేబర్ కార్డులు సృష్టిస్తూ ప్రభుత్వ ఖజనాకు గండి పెడుతున్న కార్మిక శాఖ అధికారులు, అనర్హుల పేరిట దరఖాస్తు చేయిస్తూ అధిక మొత్తాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకుంటూ, కొద్ది మొత్తంలో సంబంధిత కుటుంబాలకు అందజేస్తున్నారు. హన్మకొండ జిల్లా కార్యాలయంలోని కీలక అధికారులు ఆయా కుల, కార్మిక సంఘాల నేతలతో పాటు గ్రామాల్లో చోటామోటా రాజకీయ నేతలు, ఎల్ ఐసీ ఏజెంట్లతో సొంతగా భారీ నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకుని మరీ దందా జరుపుతున్నట్లు సమాచారం.
హన్మకొండ జిల్లా కార్మిక శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి అధికారులు, సిబ్బంది చేత కథ నడిపిస్తున్న డివిజన్, జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే కోట్ల రూపాయాలు వెనకేసినట్లుగా స్పష్టమవుతోంది. కార్మిక శాఖలో రాబందులు శీర్షికతో శుక్రవారం దిశ వరంగల్ టాబ్లాయిడ్‌లో ప్రచురితమైన కథనం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఫోకస్ చేస్తూ ఉదాహారణలతో సహా దిశ కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. ఇదే విషయాన్ని సంబంధిత శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లడం జరిగింది. హన్మకొండ జిల్లా కార్మిక శాఖ పరిధిలో జారీ చేయబడిన లేబర్ కార్డుల తీరుపై రాష్ట్రా స్థాయి అధికారులు ఆరా తీస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.
బయటపడుతున్న కొత్త కోణాలు..!
హన్మకొండ జిల్లా కార్మిక కార్యాలయంలో జరుగుతున్న అక్రమాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గ్రామాల్లో ప్రత్యేకంగా దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న అధికారులు, కుల సంఘాలతోనూ పెద్ద మొత్తంలో లేబర్‌కార్డులకు దరఖాస్తు చేయించినట్లుగా తెలుస్తోంది. లేబర్ కార్డుల మంజూరుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు కుల సంఘాల నేతల మధ్యవర్తిత్వం ద్వారా లంచాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లేబర్ కార్డు కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తుల పరిశీలన ఏఎల్‌సీలు చేస్తారు. అయితే దరఖాస్తుదారుల్లో చాలా మంది అనర్హులే ఎక్కువగా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకుండా, దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకుని లేబర్ కార్డుల మంజూరుకు ఓకే చెప్పేస్తుండటం గమనార్హం.
కుల సంఘాల నేతలు, దళారుల ద్వార కార్డు మంజూరుకు దరఖాస్తు చేసుకునే వారికి ఒక రేటు, నేరుగా దరఖాస్తు చేసుకుని డివిజన్ స్తాయి అధికారులకు వెళ్తున్న వారికి మరో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తుండటం గమనార్హం. కుల సంఘాల నేతలు, గ్రామాల్లో దళారులు భారీ మొత్తంలో లేబర్ కార్డులకు దరఖాస్తులు చేసుకునేలా అధికారులు కథ నడిపిస్తున్నట్లు సమాచారం. ఇలా భారీ సంఖ్యలో వస్తున్న దరఖాస్తుదారుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేపడుతూ దళారులు, కుల, కార్మిక సంఘాల నేతలు వాటాలు వేసుకుని మరీ పంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
లబ్ధి జరిగితే వాటా ఇవ్వాల్సిందేనట..!
లేబర్ కార్డు కలిగి ఉన్న కార్మిక కుటుంబాలకు వివిధ రూపాల్లో ఆర్థిక ప్రయోజనం కలుగుతున్న మాట వాస్తవం. ఇలా పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే ఏఎల్‌సీ సంతకం తప్పనిసరి అవుతోంది. కార్మికుడుగా పేరు నమోదు చేయించుకున్న వారికి పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల 30 వేలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.4లక్షలు వర్తిస్తుంది. సాధారణ మరణమైతే రూ.1 లక్ష 30వేలు, పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు 50 శాతం అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.4లక్షల పరిహారం వర్తిస్తుంది. కార్మికుడు పని ప్రదేశంలో చనిపోతే అంత్యక్రియల నిమిత్తం రూ.30వేలు మృతుడి కుటుంబానికి అందజేస్తారు. కార్మికురాలు, కార్మికుడి భార్య, లేదా ఇద్దరు బిడ్డలకు ఈ సదుపాయం ఉంటుంది.
ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో కాన్పు అయితే రూ.30 వేలు ఇస్తారు. ఈ సదుపాయం రెండు కాన్పుల వరకు వర్తిస్తుంది. ముందుగా కార్మిక శాఖలో పేరు నమోదు చేయించుకోవాలి. ఈ పథకం కింద రిజిష్టర్ అయిన అవివాహిత మహిళా కార్మికురాలు, కార్మికుడి ఇద్దరు కుమార్తెలకు ఈ పథకం వర్తిస్తుంది. కార్మికుడి కుమార్తె వివాహ సమయంలో రూ.30వేలు ఆర్థిక సాయం అందుతుంది. పెళ్లి, వయస్సు, ధ్రువీకరణ పత్రం, ఫొటో, వివాహ ధ్రువీకరణ పత్రం సహాయ కార్మిక అధికారికి అందజేస్తే ఈ నగదు అందజేస్తారు. పైన పేర్కొన్న బీమా ప్రయోజనం చేకూరాలంటే అధికారుల సంతకాలు తప్పనిసరి అవుతోంది. ధ్రువీకరణ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.