విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి : మంత్రి పొన్నం ప్రభాకర్

కస్తూర్బా, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 40 శాతం డైట్ & కాస్మొటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Update: 2024-11-16 10:56 GMT

దిశ, ఎల్కతుర్తి: కస్తూర్బా, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 40 శాతం డైట్ & కాస్మొటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విద్యా & సంక్షేమ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల రూ. 3.25 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి మంత్రి పొన్నం శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నిర్మాణంతో 360 మంది విద్యార్థినుల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో ఇక నీళ్లు నిలుస్తున్నాయనే పేరు రావద్దు అని గుత్తేదారునికి సూచించారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్రంలో 1029 గురుకులాల్లో 3 వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టల్స్ ఉన్నాయని చెప్పారు. 

జగిత్యాల రెసిడెన్షియల్ పాఠశాలలో పాము కరిచి విద్యార్థి చనిపోయారని, ఈ సంఘటన నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో పొదలు, గడ్డి లేకుండా ఉపాధి హామీని వినియోగించుకునేలా ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. ఈ పాఠశాలల్లో మునగ, జామ, చింత చెట్టు, కరివేపాకు చెట్లు నాటాలన్నారు. బుర్ర వెంకటేశం, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి , ఫైనాన్స్ కమిషనర్ రామకృష్ణ గురుకుల పాఠశాలల్లోనే చదివారని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అండగా ఉండి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి, ఎమ్మార్వో జగత్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సంతాజి, రాజేశ్వరరావు మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News