ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలని

Update: 2024-12-18 11:37 GMT

దిశ, కాటారం : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం మహాదేవపూర్ మండలం లో గంజి గంగమ్మ ఇంటి నమోదు ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుల వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వేలో ఏ ఒక్కరు మిస్ కావొద్దని సూచించారు. మహాదేవపూర్ మండల కేంద్రంలో 2500 మంది లబ్ధిదారులను సర్వే చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్జీదారుని వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు.

రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా లబ్ధిదారుల వివరాలను మొబైల్ యాప్ లో అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా సందేహాలు ఉంటే ఎంపిడిఓ, ఎంపీవోలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Similar News