మన బడి.. పనులు చితికిలబడి..
కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలను కల్పించి వాటిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమం భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలంలో పుంజుకోక చతికిల బడింది.
దిశ, మల్హర్ : కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలను కల్పించి వాటిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమం భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలంలో పుంజుకోక చతికిల బడింది. మొదటి దఫాలో ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న బడుల్లో పనులు ప్రారంభం, నిధుల మంజూరు వంటి విషయాల్లో జాప్యమే నెలకొంటోంది. నిధులు మంజూరైన కొన్ని పాఠశాలలో పనులు ప్రారంభమైన మిగిలిన పాఠశాలలో ప్రారంభంలో ఆలస్యం జరుగుతోంది. మరోవైపు పాఠశాలలు పునః ప్రారంభానికి సమయం దగ్గరపడటం, జూన్ నెల మొదటి వారంలోనే బడిబాట కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేసవి సెలవుల్లో బడుల్లోని సదుపాయాలను అభివృద్ధి చేసి బడుల ప్రారంభానికి కార్పొరేట్ విద్యలక్ష్యాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తేనే ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని. పెండింగ్లో ఉన్న పనులు వేసవి సెలవులలోపు పూర్తిచేయాలి. లేదంటే విద్యార్థుల రాకకు అసౌకర్యంగా ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
అరకొర నిధులు.. పాత భవనాలకు పూతలు..
మండలంలో 35 పాఠశాలలకు 14 పాఠశాలలను మన ఊరు - మన బడిలో ఎంపిక చేసి ఆయా పాఠశాలలకు రూ.2 కోట్ల 16 లక్షల పై చిలుకు మంజూరైన అరకొర నిధులతో పాతభవనాలకు కొత్త పూతలు.. పగుళ్లు బడిన గోడలకు చిన్నచిన్న మరమత్తు పనులతో పెయింటింగ్ వేస్తూ అభివృద్ధిపనులు చేస్తున్నారు. చిన్నతూండ్లలో డిలాప్టెడ్ కింద ప్రాథమిక పాఠశాల భవనంగోడ నిర్మాణంలో ఉండడం విద్యార్థులకు సౌకర్యంగా లేకపోవడం వల్ల విద్యాభ్యాసానికి ఇక్కట్లు ఏర్పడనున్నాయి. జిల్లా పరిషత్ పాఠశాలలో డైనింగ్ హాల్ పనులు గోడల వరకు ఉన్నా.. కిచెన్ షెడ్స్ నిర్మాణం మాత్రం బేస్మెంట్ లెవెల్ లోనే దర్శనమిస్తున్నాయి. మన ఊరు-మనబడిలో ఎంపికైన పాఠశాలల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం కింద మంజూరైన రూ. కోటి 60 లక్షల 52 వేల నిధులతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్, నీటి సౌకర్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరకు సంబంధించిన పనులు చేయాలని ప్రణాళికలు రూపొందించారు.
కానీ ఇప్పటివరకు కొన్నిపాఠశాలలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు పనులు పూర్తికాలేదు. అరకొరగా నిర్మించిన సిమెంట్ పనుల్లో నాణ్యత పాటించకుండా నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. వల్లెంకుంట పాఠశాలలో కూలిపోయిన కాంపౌండ్ వాల్స్ నిర్మాణం పూర్తి చేయలేదు. అధికారుల పర్యవేక్షణ లేక గుత్తేదారుల ఇష్టానుసారంతో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు కొన్ని పాఠశాలల్లో పూర్తిచేసినా.. కొంతమేర పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాక, పూర్తి పనులు చేయలేక గుత్తేదారుడు చేతులెత్తేయడంతో పాఠశాల ఆవరణలో మట్టి పెల్లలు, పాతగోడల ఇటుకలు, డస్ట్ ఉండడం అందచందంగా దర్శనమిస్తున్నాయి.
అదనపు గదుల ఊసేది ?
ప్రస్తుతం మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని మనఊరు.. మనబడి ప్రణాళిక కింద నిర్ణయించారు. కానీ నిధులు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉండడంతో అదనపు గదులను చేపట్టేందుకు అంచనాలు రూపొందించలేదు. కేవలం చిన్నచిన్న మరమ్మత్తుపనులతో పాటు మౌలిక సౌకర్యాలకు మాత్రమే నిధులు వెచ్చించినట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలను విస్మరించారు. కనీసం ఆ పాఠశాలలో చిన్నచిన్న పనులకు కూడా ఎంపిక చేయకపోవడం గమనర్హం.
చదువులకు ఆటంకం కలగకుండా..
మనఊరు.. మనబడి కార్యక్రమం ద్వారా చేపట్టే పనులు వేసవి సెలవుల్లో పూర్తి చేస్తేనే విద్యార్థులకు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. పంతుల్లు విద్యాభ్యాసం బోధించే సమయంలో పనులు చేపడితే చదువులకు ఆటంకం కలగనుంది. కార్పొరేట్ విద్య ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు ఇప్పటికైనా స్పందించి అర్ధాంతంగా నిలిచిపోయిన కొన్ని పనులు బడులు పునః ప్రారంభం కాకముందే యుద్ధ ప్రాతిపదికంగా పూర్తిచేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.