ఫ్లెక్సీలో ఫొటో కోసం బీజేపీ నేతల మధ్య వాగ్వాదం (వీడియో)

ధరణి పోర్టల్‌ ఎవరిని ఉద్ధరించలేదంటూ బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. ధరణి రైతుల పాలిట శాపంగా...Special News

Update: 2022-12-27 13:56 GMT

దిశ, వరంగల్‌ టౌన్‌: ధరణి పోర్టల్‌ ఎవరిని ఉద్ధరించలేదంటూ బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. ధరణి రైతుల పాలిట శాపంగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌కు వ్యతిరేకంగా వరంగల్‌ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ ఎంజీఎం కూడలిలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరణి ఎవరిని ఉద్ధరించిందో చెప్పాలంటూ నిలదీశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో లోపాలతో చిన్న, సన్నకారు రైతులు రోడ్డున పడ్డారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ గొడవ జరుగుతుండగానే... మాజీ కార్పొరేటర్‌, పోయినసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి కుసుమ సతీశ్‌.. గందరగోళానికి తెరతీశారు. ధర్నా నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తన ఫొటో పెట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

వరంగల్‌లో సీనియర్‌గా ఉన్న తన ఫొటో పెట్టకుండా, జూనియర్ల ఫొటో పెట్టడంపై జిల్లా నాయకత్వాన్ని నిలదీశారు. ఈ విషయంపై బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి, ధర్నా కాసేపు రసాభాసగా మారింది. ఇదిలా ఉండగా, ఈ వివాదాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై బీజేపీకి చెందిన ఓ కార్పొరేటర్‌ భర్త జలగం రంజిత్‌ దూకుడుగా వ్యవహరించారు. 'నన్ను చూడు.. నన్ను చూసి మాట్లాడు..' అంటూ మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలకు తావిస్తోంది. రైతుల కోసం చేపట్టిన ధర్నాలో పార్టీలో విబేధాలు పొడచూపడం విడ్డూరంగా ఉందంటూ పలువురు బాహాటంగా విమర్శించారు. ఫొటోల కోసం పోరాటం చేస్తున్నారా అంటూ పలువురు చర్చించుకోవడం గమనార్హం.

ధరణిని రద్దు చేయాలి

ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలోని భూములను కేసీఆర్‌ కుటుంబం, అనుచరులే దోచుకుంటున్నారని మండిపడ్డారు. భూముల పూలింగ్‌ పేరుతో రైతుల పొలాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నానుద్దేశించి మాట్లాడుతూ వీఆర్వో వ్యవస్థను తొలగించి రెవెన్యూ శాఖను రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టుపట్టించిందన్నారు. ధరణి పోర్టల్‌ లోపాలపై దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పహాణీల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. రైతులకు బీజేపీ వెన్నుదన్నుగా నిలుస్తుందని, వారి పక్షాన పోరాడుతుందన్నారు. ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మోడీ రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మేళనం ఎంతో ఉపయోగకరమని రైతులు ఉపయోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీనియర్‌ నేతలు ఎడ్ల అశోక్‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీశ్‌, అచ్చ విద్యాసాగర్‌, రత్నం సతీశ్‌, తిరుపతిరెడ్డి, బండి సాంబయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.


Similar News