ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తి : జనగామ కలెక్టర్

జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తయిందని

Update: 2025-01-06 11:40 GMT

దిశ, జనగామ: జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం, జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, ఏఎస్పీ పండారి చేతన్ నితిన్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులందరితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మహిళా సాధికారత, మహిళల హక్కులు, లైంగిక వేధింపుల నివారణ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు, అన్ని శాఖల కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ లు, ఎంపీడీఓలు, మండల స్థాయి సిబ్బంది తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.

అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఐడీఓసీ పరిసరాలను, అన్ని శాఖల కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జలుబు, దగ్గు, జ్వరం వంటివి విజృంభించకుండా తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని, ఫ్లోర్ వారీగా కమిటీలను నియమించామని, అందుకు అనుగుణంగా శుభ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం వరకు పూర్తయ్యిందని పేర్కొన్నారు. మిగిలిన దరఖాస్తుదారుల సర్వేను వేగవంతం చేసి, ఏ గ్రామాల్లో, మున్సిపాలిటీ పరిధిలో అయితే నిదానంగా సర్వే కొనసాగుతుందో గుర్తించి, ఆయా గ్రామాలను మండల ప్రత్యేక అధికారులు క్షుణ్ణంగా పర్యవేక్షించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అదే విధంగా అన్ని శాఖల కార్యాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ఖచ్చితంగా వేయాలని, ప్రతి రోజూ సమయపాలన పాటించాలన్నారు. ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ సమీక్ష సమావేశంలో జనగామ, ఘనపూర్ (స్టేషన్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, జనగామ, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీఆర్‌డీఓ వసంత, సీపీఓ పాపయ్య, డీఈఓ రమేష్, డీపీవో స్వరూప, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఈఓ రామారావు నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.


Similar News