నగరం నడిబొడ్డున గత్తర గంద్రాలయం..
వరంగల్ నగరానికి నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న వరంగల్ రీజినల్ లైబ్రరీ ఎంతో ప్రాముఖ్యత కలిగినది.
దిశ, ఖిలా వరంగల్ : వరంగల్ నగరానికి నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న వరంగల్ రీజినల్ లైబ్రరీ ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ గ్రంథాలయంలో నిత్యం వందల సంఖ్యలో నిరుద్యోగులు, పాఠకులు వచ్చి చదువుతుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి రాకపోకలకు అనుగుణంగా ఈ గ్రంథాలయం ఉండడంతో నిత్యం దాదాపు 300 మంది విద్యార్థిని, విద్యార్థులు వస్తూపోతుంటారు. ఈ గ్రంథాలయంలో చదివి వందల మంది నిరుద్యోగులు ప్రభుత్వ కొలువులను సాధించారు. చాలామంది గ్రంథాలయాన్ని సరస్వతి నిలయంగా సంబోధిస్తారు.
కానీ ప్రస్తుతం పాటకులు, నిరుద్యోగులు ఈ గ్రంధాలయంలో చదవాలంటే ముక్కు మూసుకొని చదవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిరాశ చెందుతున్నారు. దీనికి కారణం గ్రంథాలయంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సెప్టిక్ ట్యాంక్. గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం గ్రంధాలయ ఆధునికరణలో భాగంగా నిధులు కేటాయించి, గ్రంథాలయ బాహ్య భాగంలో పాఠకులు ఆకట్టుకునే రీతిలో వివిధ రంగుల్లో గ్రంధాలయంను ముస్తాబు చేసింది. కానీ అధికారులు గ్రంధాలయంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ ను మరమ్మత్తు చేయడం మరిచారు.
దీని కారణంగా సెప్టిక్ ట్యాంక్ నుండి నిత్యం మురుగునీరు లీక్ అవుతూ గ్రంథాలయ ప్రాంగణంలో పారుతుంది. దీనివలన గ్రంధాలయ పరిసర ప్రాంతంలో భరించరాని మురుగువాసనతో గత్తర లేస్తున్నది. నిరుద్యోగులు చదువుకోడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుందని మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ అధికారులు గ్రంథాలయంలోని సెప్టిక్ ట్యాంక్ ను మరమ్మత్తు చేసి మురుగునీరు లీక్ అవ్వకుండా చేసి, గ్రంధాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రంథాలయ అధికారులు కూడా చొరవ తీసుకొని నిరుపేద విద్యార్థులకు ఆహ్లాదకరమైన గ్రంథాలయాన్ని అందించాలని కోరుతున్నారు.