సాకరాశికుంట కనుమరుగు.. చోద్యం చూస్తున్న ఖిలా వ‌రంగ‌ల్‌ రెవెన్యూ అధికారులు

వ‌రంగ‌ల్‌లోని ప్రసిద్ధ సాక‌రాశికుంట జ‌లాశ‌యం కనుమరుగైంది.

Update: 2024-01-06 02:12 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్‌లోని ప్రసిద్ధ సాక‌రాశికుంట జ‌లాశ‌యం కనుమరుగైంది. పేరులోనే కుంట క‌లిగిన జ‌లాశయం స్థలాన్ని వ్యవ‌సాయేత‌ర భూమిగా మార్చేశారు ఖిలా వ‌రంగ‌ల్ రెవెన్యూ అధికారులు. చారిత్రక నేప‌థ్యం క‌లిగి ఉండి, వ‌రంగ‌ల్ అండ‌ర్ రైల్వే గేటు ప్రాంతంలోని వ‌ర‌ద నీరు పారే సాక‌రాశి కుంటను చ‌రిత్రలో క‌లిపేశారు. కుంటభూమిలో ప‌ట్టాలు క‌లిగి ఉన్న ఒక్క కార‌ణం చేత‌ క్రమంగా పూడ్చేసుకుంటూ వ‌స్తున్న హ‌క్కుదారులు, వారి సంబంధీకులు. రెవెన్యూ అధికారుల సాయంతో నాన్ అగ్రిక‌ల్చర్ ల్యాండ్‌గా మార్చేసుకున్నట్లు స‌మాచారం. 14 ఎక‌రాల కుంట‌లోని భూముల‌ నాలా క‌న్వర్షన్ వెనుక పెద్ద ఎత్తున క‌ర‌ప్షన్ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ కుంట‌లోని ప‌ట్టాదారుల‌కు అనుకూలంగా, మేలు చేసేలా వ్యవ‌సాయేత‌ర భూమిగా మార్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క ప్రజాప్రతినిధిగా వ్యవ‌హ‌రించిన నేత ప్రొద్బలం, అండ‌దండ‌లు ఉండ‌డమే కార‌ణ‌మ‌ని స‌మాచారం.

శ‌తాబ్దాల చ‌రిత్ర క‌లిగిన సాక‌రాసి కుంట‌..

శ‌తాబ్దాల చ‌రిత్ర గల సాక‌రాసి కుంట జ‌లాశ‌యం పేరు క‌నిపించ‌కుండా, వినిపించ‌కుండా చేసేశారు. వ‌రంగ‌ల్ జిల్లా ఖిల్లా వ‌రంగ‌ల్ మండ‌లం వ‌రంగ‌ల్ ఫోర్ట్ గ్రామ రెవెన్యూ ప‌రిధిలోని సాక‌రాశికుంటకు శ‌తాబ్దాల చ‌రిత్ర ఉంది. ఈ కుంట కాక‌తీయ రాజులు త‌వ్వించిన‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ కుంట కింద గ‌తంలో ఆయ‌క‌ట్టు కూడా సాగైన‌ట్లుగా తెలుస్తోంది. వ‌రంగ‌ల్ అండ‌ర్ బ్రిడ్జి, క‌రీమాబాద్‌ కు చెందిన వ‌ర‌ద నీరు ఈ జ‌లాశ‌యం నుంచి గోలుసుక‌ట్టు చెరువుల ద్వారా న‌గ‌ర వెలుపలకు వెళ్లేది. అయితే కాల‌క్రమంలో ఈ జ‌ల‌శ‌యం భూములు అన్యాక్రాంత‌మ‌వుతూ వ‌చ్చింది.

చెరువు, కుంట‌ల్లో ప‌ట్టాలు క‌లిగి ఉన్నప్పటికీ ఫుల్ ట్యాంకు లెవ‌ల్ ప‌రిధి హ‌ద్దుల‌ను చెరిపివేయ‌డం, కూల్చడం, పూడ్చడం చేయ‌కూడ‌దు. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని భూముల‌ను వ్యవ‌సాయేత‌ర భూములుగా మార్చకూడ‌ద‌ని రెవెన్యూ చ‌ట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఖిలావ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్ కార్యాల‌య అధికారులు నిబంధ‌న‌ల‌కు నీళ్లొదిలేశారు. అక్రమంగా నాలా క‌న్వర్షన్ చేప‌ట్టి సాక‌రాశి కుంట‌కు తీర‌ని అన్యాయం చేసేశారు. ఈ ప్రాంతంలో గ‌జం భూమి ధ‌ర రూ.30వేల‌కు పైగా అమ్మకాలు జ‌రుగుతుండ‌టంతో సాక‌రాశి కుంట‌ను పూడ్చుతూ వ‌చ్చేశారు. కొన్నాళ్ల క్రితం నుంచే ఓ ప‌ద్ధతి ప్రకారం నాశ‌నం చేసి స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించిన‌ట్లుగా స్పష్టమ‌వుతోంది.

నాటి కీల‌క ప్రజాప్రతినిధి ప్రోద్బలంతోనే అక్రమాలు..!

సాక‌రాశి కుంట భూమిలో ప్రైవేటు వ్యక్తుల‌కు ప‌ట్టాలున్నాయి. కుంట‌లో 1242/1 స‌ర్వే నెంబ‌ర్‌పై 14 ఎక‌రాల విస్తీర్ణానికి ప‌ట్టా క‌లిగిన హ‌క్కు దారుడికి రెవెన్యూ చ‌ట్టాల‌కు విరుద్ధంగా ఖిలావ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్ కార్యాల‌య అధికారులు నాలా క‌న్వర్షన్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క ప్రజాప్రతినిధిగా ఉన్న నేత ప్రొద్బలంతోనే రెవెన్యూ చ‌ట్టాల‌కు తిలోద‌కాలిస్తూ అక్రమంగా ఎఫ్టీఎల్ భూముల‌ను నాలా క‌న్వర్షన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవ‌హారంలో కోట్ల రూపాయలు చేతులు మారిన‌ట్లు స‌మాచారం. 2009లో రెవెన్యూ రికార్డుల ప్రకారం స‌ర్వే నెంబ‌ర్ 1242 కింద 14 విస్తీర్ణంతో ఈ కుంటలో ప్రైవేటు వ్యక్తుల‌కు భూములున్నట్లుగా స్పష్టమ‌వుతోంది. కుంట‌లోని 14 ఎక‌రాల భూమి మొత్తం ఆకార‌పు వీర‌ల‌క్ష్మి ప‌ట్టా క‌లిగి ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డుల ద్వారా తెలుస్తోంది.

అయితే, కొన్నాళ్ల క్రితం 1242/1 స‌ర్వే నెంబ‌ర్‌తో శ్రీ ల‌క్ష్మి కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ వ‌రంగ‌ల్ పేరు మీద‌కు భూ హ‌క్కులు బ‌ద‌లాయింప‌బ‌డిన‌ట్లు ధ‌ర‌ణిలోని భూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వ్యవ‌సాయేత‌ర భూమిగా 14 ఎక‌రాల విస్తీర్ణం క‌లిగి ఉన్న స్థలాన్ని ధ‌ర‌ణిలో చూపెడుతోంది. ఈకేవైసీకి ఆధార్ లింక్ చేయ‌క‌పోవ‌డంతో హ‌క్కుదారులెవ‌ర‌న్నది ధ‌ర‌ణిలో చూపెట్టడం లేదు. ఇదిలా ఉండ‌గా సాక‌రాశికుంటలోని ప‌ట్టా భూముల‌పై నాలా క‌న్వర్షన్ సాధించిన స‌ద‌రు వ్యక్తులు నాన్ లే అవుట్ చేశారు. 39 వ డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న ఈ నాన్ లేవుట్‌ను అడ్డుకోవాల్సిన జీడ‌బ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్ఐలు అటు వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేద‌ని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News