మైనింగ్ భూములకు రైతుబంధు.. ప్రజా ధనం పక్కదారి!

చిన్న, మధ్య తరగతి రైతుల వ్యవసాయ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం మైనింగ్ చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న బడాబాబులకు అందుతోంది.

Update: 2024-09-27 02:36 GMT

దిశ, ములుగు ప్రతినిధి: చిన్న, మధ్య తరగతి రైతుల వ్యవసాయ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం మైనింగ్ చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న బడాబాబులకు అందుతోంది. ఇందుకు ములుగు జిల్లా మల్లంపల్లి చుట్టుపక్కల జరుగుతున్న మైనింగ్ భూములే ప్రత్యక్ష సాక్ష్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుబంధును ములుగు మండలంలోని మల్లంపల్లి, రామచంద్రాపూర్, అబ్బాపూర్, పందికుంట, దేవనగర్ గ్రామాల్లో ఉన్న లాటరైట్, డోలమిటే మైనింగ్ క్వారీ భూములకు ఇచ్చింది. మైనింగ్ వ్యాపారులు ప్రతి సంవత్సరం ప్రభుత్వం కళ్లుగప్పి రైతుబంధు సొమ్మును తమ ఖాతాలో వేసుకుంటున్నారని సమీప గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

రూ.కోట్లలో రైతుబంధు సొమ్ము..

చిన్న, మధ్య తరగతి రైతులకు పెట్టుబడి సాయంకింద అందించే రైతుబంధు నిధులు తప్పుదోవ పట్టాయని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తున్న క్రమంలో ములుగు జిల్లా లోని మల్లంపల్లి, రామచంద్రాపురం, పందికుంట, దేవనగరం గ్రామాల్లో సుమారు 800 ఎకరాల మేర లాటరైట్, డోలమైట్ ముడి ఖనిజం మైనింగ్ భూములకు రైతుబంధు స్వాహా చేస్తున్నారు. దాదాపు 80 శాతం మేర భూములకు వచ్చే రూ.కోట్లలో రైతు బంధు సొమ్మును ఆయా మైనింగ్ కంపెనీ యజమానులు పొందుతుండడం రైతుబంధు సొమ్ము దుర్వినియోగంపై వచ్చే మాటలకు బలం చేకూరుస్తోంది. మల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో మైనింగ్ జోరుగా సాగుతోంది. బడా వ్యాపారులు అంతా అక్కడ రైతుల నుంచి భూములు కొనుగోలు చేయడం లేదా లీజ్‌కు తీసుకుని మైనింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అందించే రైతుబంధు సొమ్మును మాత్రం సదరు వ్యాపారులు నొక్కేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

రైతుబంధు సొమ్ము బదిలీలు..

రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు బంధు సొమ్మును మైనింగ్ యజమానులు తమ జేబులో వేసుకుంటున్నారడానికి నిదర్శనంగా 2019లో ప్రభాకర్ రావు మైన్స్ పేరు పై లాట్రైట్, డోలమైట్ వెలికి తీయడం కోసం 13/2,14/2,31/2,32/2,33/2,35/2,37/2 సర్వే నెంబర్లతో దాదాపు 30 ఎకరాల మేర అనుమతులు తీసుకున్నారు. సదరు మైనింగ్ యజమాని తన పేరుపైనే వ్యవసాయ భూమి కొనసాగిస్తూ 2019 నుంచి వచ్చే రైతుబంధును తన అకౌంట్‌లోకి మళ్లించుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వేంకటేశ్వర మైన్స్ అండ్ మినరల్స్ పేరుతో 1/2 సర్వే నెంబర్ పై 12 ఎకరాల భూమిలో మైనింగ్ కోసం అనుమతులు తీసుకున్న వ్యాపారి రైతుబంధు సొమ్ము జేబులో వేసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

ఇక తిరుమల మైన్స్ అండ్ మినరల్స్ పేరుతో 459,459/1,459/2,454,454/1,455/3,460,460/1,460/3,460/4 సర్వే నెంబర్లలోని 28 ఎకరాల భూమిని మైనింగ్ కోసం అనుమతులు తీసుకున్నారు. అదేవిధంగా గాయత్రి మైన్స్ అండ్ మినరల్స్ పేరుతో 79/2/A,75/2/A,82/2/C,82/2/B,76/2,80/2/A,82/A,83/2 సర్వే నెంబర్లలో 10 ఎకరాల మేర భూమిని మైనింగ్ చేసేందుకు మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని రైతుబంధు సొమ్మును కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చాలా వరకు మైనింగ్ చేసే వ్యాపారులు రైతు బంధు మొత్తాన్ని స్వాహా చేస్తున్నారని బహిరంగంగా జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.

చీకటి ఒప్పందమా..?

ములుగు జిల్లాలో 50కి పైగా ఉన్న మైనింగ్ సంస్థల యజమానులలో చాలా వరకు వ్యవసాయ భూములుగా కొనసాగిస్తూనే ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని లూఠీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మైనింగ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే మైనింగ్ భూములకు రైతుబంధు సాయం అందుతోందని కొందరు భావిస్తుంటే, మరికొందరు మైనింగ్ వ్యాపారుల కనుసన్నల్లో ఉన్న అధికారులు చీకటి ఒప్పందంతోనే అగ్రికల్చర్ ల్యాండ్‌ను కమర్షియల్‌గా మార్చకుండా మైనింగ్ వ్యాపారికి లబ్ధి చేకూర్చే విషయంలో సహాయపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నారు.

సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్

ఏళ్లుగా పేద రైతులకు అందాల్సిన రైతు బంధు సాయం కొందరు మైనింగ్ వ్యాపారులు పొందుతున్న తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. మైనింగ్ చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న సంతృప్తి చెందకుండా ప్రభుత్వం అందించే రైతుబంధు సొమ్మును ఇలా దోచుకోవడం సమంజసం కాదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సంబంధిత అధికారులతో సర్వే చేయించి మైనింగ్ భూములను గుర్తించాలని, సదరు మైనింగ్ యజమానుల నుంచి రైతుబంధు సొమ్మును రికవరీ చేయాలని, ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు అనుమతులను కూడా రద్దు చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Similar News