వచ్చే మార్చిలో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం : మంత్రి శ్రీధర్ బాబు
మండలం లో కిషన్ రావు పల్లి- జిల్లా కేంద్రం భూపాలపల్లి పట్టణానికి
దిశ,మల్హర్: మండలం లో కిషన్ రావు పల్లి- జిల్లా కేంద్రం భూపాలపల్లి పట్టణానికి అనుసంధానం చేసే పెండింగ్ లో ఉన్న రోడ్డు మార్గం వచ్చే మార్చిలో నిర్మాణానికి శ్రీకారం చుడతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని మల్లారంలో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ పెద్దతూండ్లలో శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ తాటిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రానికి రవాణా మార్గం దూరాభారం కలగకుండా నిర్మిస్తానన్న రోడ్డు మార్గాన్ని వచ్చే సంవత్సరం మార్చిలో రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం జరుగుతాయని ఆయన తెలిపారు. ఆర్ అండ్ బి, ఫారెస్ట్ అధికారుల అనుసంధానం తో ముడిపడి ఉన్న ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉండడం వల్ల పనులు చేయడానికి కొంత ఆలస్యం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ బడ్జెట్ కేటాయింపు జరగగానే ప్రభుత్వం ఫారెస్ట్ శాఖకు చెల్లించే రూ. 4 కోట్ల 67 లక్షల 75 వేల పైచిలుకు నిధులు చెల్లించిన అనంతరం నిర్మాణం చేపట్టే రోడ్డు పనులకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రోడ్ పనుల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.
అనంతరం పెద్దతూండ్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జక్కుల వెంకటస్వామి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వెంకటస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియపరిచారు. మంత్రి వెంట రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడిదల రాజయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఐత రాజిరెడ్డి, బాణోత్ కిషన్ నాయక్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ దండు రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి కుమార్ తో పాటు వివిధ శాఖల అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు పర్యటన లో భాగంగా కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.