దిశ, గార్ల: ప్రాజెక్టులతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కమిషన్ల పేరుతో దండుకున్న బీఆర్ఎస్ అవినీతి పాలనను తరిమి కొట్టాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్ నాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు జస్వంత్ ఠాగూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల దేశం సర్వతోముఖాభివృద్ధి చెంది ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఉద్యోగ నియామకాలు లేక ఉన్నత విద్యలు చదివిన యువకులు ఉద్యోగాలు లేక ఉపాధి లభించక వృద్ధులైన తల్లిదండ్రులను పోషించలేక నిరాశకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో 'మీ భూమి' యాప్ ఏర్పాటు చేస్తామని పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు ఉంటుందన్నారు. అర్హత కలిగిన కుటుంబాల కొత్త రేషన్ కార్డులు, ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ. 2500 సబ్సిడీ పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచిత పంట బీమా వరికి రూ. 3100 మద్దతు ధర కల్పిస్తామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలా అనేక పథకాలు చక్కగా అమలు అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ సెక్రటరీ రావుక విమల్ కుమార్ జైన్, ఇల్లందు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ తోడేటి నాగరాజు, ఇల్లందు నియోజకవర్గ పార్టీ సెక్రటరీ రమేష్, బిజెపి పార్టీ మండల నాయకులు జంపాల శీను, బుచ్చిబాబు దేవా వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.