కవి రచయిత సుధాకర్ కు అరుదైన గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభకు సి.బి.ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
దిశ,డోర్నకల్ : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభకు సి.బి.ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలుగు రచయితలు హాజరై తెలుగు భాష మనుగడకు, పరిరక్షణలో రచయితల పాత్ర అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. భాషా ప్రాముఖ్యతను సామాన్య ప్రజలకు తెలియజేసే విధంగా రచనలు చేస్తూ చైతన్యం తీసుకురావాలని అభిలాషించారు.
అలాగే డోర్నకల్ మండలం మన్నెగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,రచయిత విత్తనాల సుధాకర్ కలం నుంచి జాలువారిన "జాబిలమ్మ" కవితా సంపుటిని 3వ సభా వేదికపై కవులు,రచయిత సాధనాల వెంకటస్వామి నాయుడు,రామయ్య,లెనిన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం సుధాకర్ కవితా పఠనాన్ని అతిధులు,ఆహుతులు అభినందించారు. రచనలోని చక్కని భావాలు,అర్ధాలను ఎంతగానో మెచ్చుకున్నారు. తెలుగు భాష మనుగడకు, పరిరక్షణ వికాసానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సేవలను గుర్తించి జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కరించారు. కవి,రచయిత విత్తనాల సుధాకర్ మాట్లాడుతూ.. మాతృభాష, సాంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.