రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి చేయాలి

రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Update: 2024-09-11 12:57 GMT

దిశ, ములుగు ప్రతినిధి : రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని మంత్రి సీతక్క ఛాంబర్ లో పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ, పర్యాటకశాఖ అధికారులు, ములుగు జిల్లా కలెక్టర్ తో రామప్ప అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని, అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది అని తెలిపారు. తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయం అని, అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి అని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

    గడువులోపు పనులు పూర్తి చేయాలని, పనుల్లో అలసత్వం వహిస్తే ప్రజలు క్షమించరని అన్నారు. రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతాలు, టూరిజం కేంద్రాలున్నాయన్నారు. లక్నవరం, బొగత, సమ్మక్క సారలమ్మ దేవాలయం వంటి ఎన్నో చారిత్రక ప్రాంతాలు ములుగులో ఉండటం, అక్కడ కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ రాబోతుందని పేర్కొన్నారు. కావున పర్యాటకంగా అభివృద్ధి పరచాలని, రామప్ప చుట్టుపక్కల సహజత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అని, రామప్ప దేవాలయంతో పాటు, రామప్ప చెరువు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసుకొని ఆ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు, ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.   

Tags:    

Similar News