Putta Madhu : పుట్ట మధుకు నిరసనసెగ..
మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్
దిశ, కాటారం : మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ కు మహదేవపూర్ మండలంలోని నాగేపల్లి గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం లో ఎంపిక చేసిన లబ్దారులే ఓటేస్తారు మీరు మా గ్రామానికి రావద్దంటూ గ్రామ ప్రజలు అడ్డు తగిలారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకం బ్యాక్ వాటర్ తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పంటలు కోల్పోతున్నామని ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదని, నాకు మీరు ఎలాంటి సహాయం అందించలేదని నాగేపల్లి గ్రామ ప్రజలు పుట్ట మధు ను ప్రశ్నించారు. దళిత బంధు, గృహలక్ష్మి ఇతర పథకాలు అర్హులకు ఇవ్వలేదని ఐదేళ్లుగా గ్రామాన్ని పట్టించుకోలేదని ప్రజలు బి.ఆర్.ఎస్ అభ్యర్థి పుట్ట మధును అడిగారు.
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయలేదని గ్రామ సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఈసారి ఓట్లు వేసి గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తానని పుట్ట మధు వాపోయారు. ప్రజలు వివిధ సమస్యలపై ప్రశ్నించడంతో పుట్ట మధు వాహనంలో వెళ్లిపోయారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మీరు మా సమస్యలను పట్టించుకోరా ఎందుకు తీర్చలేదని మహిళలు ప్రశ్నిస్తూ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ పోత వెంకటస్వామి, మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాబు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.