ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలు : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలు పొందుపరిచి పరిష్కరిస్తామని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, హన్మకొండ: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలు పొందుపరిచి పరిష్కరిస్తామని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రలో భాగంగా సోమవారం హన్మకొండ, వరంగల్ జిల్లాలో చేపట్టిన 20 కిలోమీటర్ల పాద యాత్రలో భాగంగా హన్మకొండ ఆడ్స్ కాలేజి నుండి కాళోజీ జక్షన్, ఏకశిలా పార్క్, భాల సముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి కి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు ప్రధాన కార్యదర్శి సదయ్య, కోశాధికారి అమర్, కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రేవంత్ రెడ్డి కి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు కేటాయించిన నివాస స్థలాలను నేటికి వారికి ఇవ్వలేదని అన్నారు. అన్ని వర్గాలకు జరిగిన అన్యాయమే జర్నలిస్టుల కు జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.