అర్జీలన్నీ అటకమీదకే…పని చేయని ఆన్‌లైన్ పోర్టల్
ప్రజాపాలన ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. తీసుకున్న దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా పేరుకుంటున్నాయి తప్ప పరిష్కారానికి నోచుకునే పరిస్థితి లేదు.
దిశ, వరంగల్ టౌన్ : ప్రజాపాలన ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. తీసుకున్న దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా పేరుకుంటున్నాయి తప్ప పరిష్కారానికి నోచుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. పల్లెలు, పట్టణాల్లో వాడవాడలా సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. అర్జీలు వెల్లువలా వస్తుండడంతో మూడు నెలలకోసారి ప్రజాపాలన సభలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇక వరంగల్ బల్దియాలో నిరంతరాయంగా వినతుల స్వీకరణ జరుగుతోంది. కానీ, వాటి పరిష్కారం మాత్రం పరిహాసంగా మారింది.
అసలు సమస్య వేరే!
ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గ్యాస్ సిలిండర్, జీరో బిల్లు విద్యుత్ స్కీంలకు ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే, ఇందులో కొత్తగా స్కీం అమలు కోసం అందుతున్న దరఖాస్తుల కంటే మార్పులు, చేర్పులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. చాలామంది కుటుంబాల్లో గ్యాస్ కనెక్షన్ మహిళల పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విద్యుత్ మీటర్లు పురుషుల పేరు మీద ఉన్నాయి. పథకాల అమలులో ఇదే సమస్యగా మారినట్లు తెలుస్తోంది. మొదట దఫా దరఖాస్తులు స్వీకరించిన సందర్భంలో ఆన్‌లైన్ ఎంట్రీలో రేషన్‌కార్డు ఆధారంగా ఇంటి యజమాని ఆధార్‌కార్డు నంబర్ మాత్రమే నమోదు చేసి ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్యాస్ మహిళ పేరు, కరెంట్ బిల్లు పురుషుల పేరిట ఉండడంతో ఏదో ఒక స్కీంలోనే లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాలామంది దరఖాస్తుల్లో మార్పులు కోరుతూ వినతులు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
పనిచేయని పోర్టల్..
తీసుకున్న దరఖాస్తులకు పరిష్కరించే అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. కొత్తగా పేర్లు నమోదు చేద్దామంటే ఆన్‌లైన్ ఓపెన్ కావడం లేదని తెలుస్తోంది. దీంతో కనీసం మార్పులు చేసుకునే చాన్స్ కూడా లేకుండా పోయింది. ఫలితంగా తీసుకున్న దరఖాస్తులు బల్దియాలో బల్లల మీద పేరుకుపోతున్నాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించకపోతే.. ప్రజలకు జీరాక్స్‌ల ఖర్చు.. బల్దియాలో వాటిని దాచే ప్లేస్ వృధా కానున్నాయి.