ర‌గిలిన రైత‌న్న.. ఎనుమాముల మార్కెట్‌లో ర‌ణ‌రంగం (వీడియో)

Update: 2022-01-24 10:55 GMT

దిశ, వ‌రంగ‌ల్ టౌన్: వ‌రంగ‌ల్ మార్కెట్లో వ్యాపారుల మోసాల‌కు మిర్చి రైతులు ర‌గిలిపోయారు. న్యాయ‌మైన ధ‌ర పెట్టాల‌ని వ్యాపారుల‌ను కోరినా స్పందించ‌క‌పోవడంతో ప‌రిపాల‌న భ‌వ‌నం ఎదుట‌ నిర‌స‌న‌కు దిగారు. ఆగ్రహంతో ర‌గిలిపోయిన కొంత‌మంది రైతులు ప‌రిపాల‌న భ‌వ‌నం, మిర్చి కార్యాల‌యం భ‌వన అద్దాల‌ను ధ్వంసం చేశారు. రైతుల డిమాండ్లను ప‌ట్టించుకోకుండా కొనుగోలు చేసిన కొంత స‌రుకును గోదాంకు త‌ర‌లించేందుకు య‌త్నించిన ఓ వ్యాపారి డీసీఎం వాహ‌నాల‌ను సైతం ధ్వంసం చేశారు. ఉద‌యం నుంచి కొన‌సాగుతున్న రైతు నిర‌స‌నల‌ను అధికారులతో పాటు వ్యాపార వ‌ర్గాలు, పాల‌క వ‌ర్గం కూడా పట్టించుకోలేదు. దీంతో రైతుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మార్కెట్లో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. పోలీసులు రంగప్రవేశం చేసి, మార్కెట్ గేట్లకు తాళాలు వేసి రైతుల‌ను లోనికి రానివ్వలేదు. రైతుల ఆందోళ‌న ఉధృత‌మ‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో పోలీసులు ప‌హారా కాస్తున్నారు. రోజంతా నిర‌స‌న‌లు జ‌ర‌గ‌డంతో కాంటాలు, ఖ‌రీదులు ఏమీ జ‌ర‌గ‌లేదు. వ్యాపారుల మోసాలను పాల‌క వ‌ర్గం నియంత్రించాల‌ని, నాణ్యమైన స‌రుకుకు న్యాయ‌మైన ధ‌ర ద‌క్కేంత వ‌ర‌కూ తాము వ్యాపారుల‌కు పంట‌ను విక్రయించ‌బోమ‌ని రైతులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

Tags:    

Similar News