ప్రశాంతంగా సింగ‌రేణి ఎన్నిక‌లు..

Update: 2023-12-27 14:06 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : భూపాల‌ప‌ల్లి సింగ‌రేణి ఏరియాలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నిక‌ల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. భూపాలపల్లి డివిజన్‌లో మొత్తం 5410 మంది ఓటర్లు ఉండ‌గా, 9 కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 5410 ఓట్లకు గాను.. 5,123 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.94.7 శాతం పోలింగ్ నమోదైన‌ట్లు అధికారులు ప్రక‌టించారు. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సంఘాల మధ్య హోరా హోరీ పోరు జరిగింది. కౌంటింగ్ అనంత‌రం సింగరేణి మినీ ఫంక్షన్ హాల్‌కు బ్యాలెట్ బాక్సుల‌ను త‌ర‌లించారు.

కౌంటింగ్ కోసం 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. సాయంత్రం 7గంటలకు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెలువడనుంది.మొత్తం 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ - కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. కాగా సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలుత ఇల్లందు ఏరియా ఫలితం వెలువడనుంది. ఏఐటీయూసీ-ఐఎన్టీయూసీ సంఘాలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి.


Similar News