ములుగు మున్సిపాలిటీ బిల్లును ఆమోదించండి : మంత్రి సీత‌క్క‌

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌ వర్మతో పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది

Update: 2024-09-24 11:32 GMT

దిశ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌ వర్మతో పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల‌ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క భేటీ అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటిగా మారుస్తూ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించాల‌ని విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. మంగ‌ళ‌వారం నాడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ప‌టేల్ తో క‌ల‌సి రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ తో స‌మావేశ‌మ‌య్యారు.ములుగు మున్సిపాలిటి అంశంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ ఘ‌ర్ష‌ణ వివ‌రాల‌ను గ‌వ‌ర్న‌ర్ కు వివ‌రించారు. ములుగును మున్సిపాలిటీ గా మారుస్తూ 2022 లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది.అయితే సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు ములుగు మున్సిపాలిటికి నోచుకోలేదు. జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ల బిల్లులోనే ములుగు మున్సిపాలిటి అంశాన్ని చేర్చారు.

జీహెచ్ఎంసీలో కోఆప్ష‌న్ స‌భ్యుల సంఖ్య‌ల‌ను 5 నుంచి 9 కి పెంచుతు, మైనార‌టి కోఆప్ష‌న్ స‌భ్యుల సంఖ్య‌ను 2 నుంచి 5 కు పెంచుతూ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ చేసారు. అదే బిల్లులో ములుగు మున్సిపాలిటి అంశం ఉండ‌టంతో బిల్లుకు అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజన్ ఆమోదం తెల‌పలేదు. ఆ త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యానికి బిల్లును పంపారు. దీంతో అప్ప‌టి నుంచి బిల్లు పెండింగ్ లోనే ఉండిపోయింది. దీంతో ఆ బిల్లును ఆమోదించేలా చొర‌వ చూపాల‌ని మంత్రి సీత‌క్క గ‌వ‌ర్న‌ర్ ను విజ్ఞప్తి చేసారు. దీంతో పాటు ఆదిలాబాద్ లో ఈ మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ విష‌యాల‌న‌ను, ప్ర‌స్తుతం అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్ధితుల‌ను, ఆదివాసులు, మైనారిటీ వ‌ర్గాల మ‌ద్య స‌ఖ్య‌త కుదుర్చేలా ప్ర‌భుత్వం వైపు నుంచి జ‌రుగుతున్నప్ర‌య‌త్నాల‌ను గ‌వ‌ర్న‌ర్ కు మంత్రి సీత‌క్క వివ‌రించారు. గిరిజ‌న ప్రాంతాల ప్రత్యేక పాల‌న అధికారిగా ఆదిలాబాద్ లో ప‌ర్య‌టించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను సీత‌క్క కోరారు.


Similar News