నాలాల ఆక్రమణకు అడ్డేది?
నాలాల ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా బల్దియా పాలకవర్గం, అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది. బల్దియా అధికారుల చేతకాని మాటలు తప్పా చేసిన పనులు ఎక్కడా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 100 ఫీట్ల
నాలాల ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా బల్దియా పాలకవర్గం, అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది. బల్దియా అధికారుల చేతకాని మాటలు తప్పా చేసిన పనులు ఎక్కడా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 100 ఫీట్ల వరద నీటి నాలాను నయీమ్ నగర్ నుంచి కేయూ డబ్బాల వరకు ఆక్రమించినా అధికారులు గుర్తించిన పాపాన పోవడం లేదు. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు రాజకీయం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం సమీపిస్తున్నా కాల్వలోని చెత్తచెదారాన్ని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజుల కింద గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగమేఘాల మీద నాలాపై అక్రమ నిర్మాణాలు తొలగించి పూడికతీత పనులు చేపట్టారు. ఆ తరువాత కొద్ది రోజులకే పనులను నిలిపి వేయడం వెనుక ఆంతర్యం ఏంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిడితో పనులు నిలిపారా..? లేక ఆపారా..? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు నాలాలు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించి వర్షాకాలంలో వరద ముంపునుంచి లోతట్టుకాలనీలను కాపాడాలని కోరుతున్నారు.