ముత్తిరెడ్డి కాదు కబ్జా రెడ్డి.. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో వైఎస్ షర్మిల
జనగామ ఎమ్మెల్యే పేరు ముత్తిరెడ్డి కాదు కబ్జా రెడ్డి అంటూ వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మండిపడ్డారు.
దిశ, జనగామ: జనగామ ఎమ్మెల్యే పేరు ముత్తిరెడ్డి కాదు కబ్జా రెడ్డి అంటూ వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మండిపడ్డారు. వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సోమవారం సాయంత్రం బచ్చన్నపేట మీదుగా జనగామకు చేరుకుంది. ఈ సందర్భంగా జనగామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ముత్తిరెడ్డి భూ అక్రమాలపై విరుచుకుపడ్డారు. జనగామ ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పక్కనపెట్టి అమాయక, పేద, గిరిజనుల భూములను ఆక్రమించారని ఆరోపించారు.
రెవెన్యూ వ్యవస్థలో చైన్ మెన్ గా పనిచేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రెవిన్యూ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకొని ఒక్క జనగామ ప్రాంతంలో 500 ఎకరాలు కబ్జా చేశారని, ఇది తాను చెప్పడం లేదని జిల్లా ప్రజలు చెబుతున్నారని సెటైర్లు విసిరారు. గతంలో ఈ జిల్లా కలెక్టర్ గా పని చేసిన మహిళా ఐఏఎస్ అధికారి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూకబ్జాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. తప్పు చేస్తే తన కొడుకైన శిక్షార్హుడే అని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ కబ్జా రెడ్డి పై చర్యలు తీసుకోవాల్సింది పోయి పెంచి పోషించాడని ఆమె విమర్శించారు. సీఎం కేసీఆర్ కు ఒక్క ఫామ్ హౌస్ ఉంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి మూడు ఫాం హౌస్ లు ఉన్నాయని తనదైన శైలిలో ఘాటుగా విమర్శించారు.