కాగజ్ నగర్ ఆసుపత్రిలో వైద్య సేవలు కరువు

పేరుకే ఈఎస్ఐ ఆసుపత్రి.. ఇక్కడ సేవలు మాత్రం నాస్తి. ఇది కాగజ్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి పరిస్థితి. కాగజ్నగర్ లో కార్మికుల కోసం ప్రభుత్వ బీమా ఆసుపత్రిని నిర్మించింది. ఎస్పీఎం, పురపాలక సంఘం, దుకాణాలు, రైస్ మిల్లులు, దాదాపు 9

Update: 2023-06-08 03:33 GMT

దిశ, కాగజ్ నగర్ :పేరుకే ఈఎస్ఐ ఆసుపత్రి.. ఇక్కడ సేవలు మాత్రం నాస్తి. ఇది కాగాజ్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి పరిస్థితి. కాగజ్నగర్ లో కార్మికుల కోసం ప్రభుత్వ బీమా ఆసుపత్రిని నిర్మించింది. ఎస్పీఎం, పురపాలక సంఘం, దుకాణాలు, రైస్ మిల్లులు, దాదాపు 9 వేల మంది కార్డుదారులు ఉన్నారు. ప్రతినెల వీరి నుంచి ఈఎస్ఐ కోసం కోత విధిస్తూ రూ.1.90 లక్షలు కార్పొరేషన్కు చెల్లిస్తున్నారు. కానీ కార్మిక కుటుంబాలకు అంతంత మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రి వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని

ఆరోపణలున్నాయి. ఆసుపత్రిలో పూర్తి బాధ్యతను నిర్వర్తించాల్సిన సూపరింటెండెంట్ ఈఎస్ఐ ఆసుపత్రిలో విధులను నిర్వర్తించకుండా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యం అధ్వానంగా మారనుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ఆసుపత్రిలో అటకెక్కిన వైద్యం

కార్మిక ప్రజలకు వైద్యం అందించాల్సిన వైద్యులు ఆసుపత్రికి రాకపోవడంతో వైద్యసేవలు సరిగా అందడం లేదు. , ఆసుపత్రి పై పూర్తి స్థాయి పరిశీలన లేకపోవడంతో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. ఆసుపత్రికి వచ్చి పోయే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈఎస్ఐ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.ఆసుపత్రిలో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన సూపరింటెండెంట్ ఆసుపత్రికి రాకపోవడంపై కార్మికులు మండి పడుతున్నారు. ఆస్పత్రిపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని ఆరోపిస్తున్నారు.

వంతుల వారి డ్యూటీలు

ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యులు పెద్ద మొత్తంలో వేతనాలు తీసుకుంటూ వంతుల వారిగా డ్యూటీలు చేస్తున్నారని కార్మికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలో నలుగురు సివిల్ డిప్యూటీ సర్జన్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాప్ నర్సులు, ఏఎన్ఎంలు 83 మంది పనిచేస్తున్నారు. కాగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు డిప్యూటీ సివిల్ సర్జన్లు వంతుల వారిగా డ్యూటీలు నిర్వహిస్తూ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, పట్టణాలలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తూన్నారు. మరికొందరు ఈఎస్ఐ ఆసుపత్రిలో పనిచేసినట్టు హాజరు చూపుకుంటూ వేతనం తీసుకుంటున్నారు.

సూపరింటెండెంట్ తీరుపై ..

కాగజ్నగర్ పట్టణంలోని షణ్ముఖ ప్రైవేట్ ఆస్పత్రికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలో ఈఎస్ఐ సూపరిండెంట్ డాక్టర్ రవి కిరణ్ చైతన్య ఫొటో ఉండడం కలకలం రేపుతుంది. ప్రభుత్వ వైద్యుడిగా చలామణి అవుతూ మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేయడంపై అనుమానాలకు తావిస్తోంది. అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించాల్సిన ఇతగాడు వరంగల్ నుంచి నేరుగా షణ్ముఖ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ డ్యూటీని చేస్తూ ఈఎస్ఐ ఆసుపత్రిలో హాజరు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై కాగజ్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి సూపరిండెంట్ రవి కిరణ్ చైతన్యను వివరణ కోరగా షణ్ముఖ ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైనా కేసు వచ్చినప్పుడు ఫోన్ వస్తే సాయంత్రం వెళ్తానని సమాధానం ఇచ్చారు.

Tags:    

Similar News