డ్రైనేజీ సమస్య తొలగింపుకు పెద్ద పీట.. Narsampeta మున్సిపల్ చైర్ పర్సన్
డ్రైనేజీ సమస్య తొలగింపుకు పెద్ద పీట వేస్తున్నామని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్ తెలిపారు.
దిశ, నర్సంపేట: డ్రైనేజీ సమస్య తొలగింపుకు పెద్ద పీట వేస్తున్నామని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్ తెలిపారు. మంగళవారం నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం విడుదలైన రూ.15 కోట్లకు సంబంధించి కృతజ్ఞతా సమావేశాన్ని ఎమ్మెల్యే క్యాంప్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు గాను టీయూఎఫ్ఐడీసీ మూడో విడతగా రూ.15 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో నర్సంపేట పట్టణంలో వివిధ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణ వ్యాప్తంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పలు డ్రైనేజీ నిర్మాణాలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. మొత్తం నిధుల్లో రూ. 10కోట్ల 70 లక్షలను డ్రైనేజీ నిర్మాణాలకి కేటాయించామని తెలిపారు. మిగతా రూ.4 కోట్ల 30లక్షలను నర్సంపేట పట్టణంలోని పలు బీటీ రోడ్ల నిర్మాణం, మున్సిపాలిటీ కార్యాలయం నందు కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం, ఆడిటోరియం, పార్కు మొదలైన పనులకు వినియోగించనున్నట్లు ఆమె చెప్పారు.