డోర్నకల్‌తోనే నా ప్రయాణం.. కాంగ్రెస్ నేత, కిసాన్ పరివార్ అధినేత భూపాల్‌నాయక్
కిసాన్ పరివార్ అధినేత, ప్రముఖ సామాజిక వేత్త ననావత్ భూపాల్‌నాయక్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు.
దిశ, వరంగల్ బ్యూరో : కిసాన్ పరివార్ అధినేత, ప్రముఖ సామాజిక వేత్త ననావత్ భూపాల్‌నాయక్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన డోర్నకల్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ కోరుతూ అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్న ఆయన పరిస్థితులను తన వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతిపిన్న వయస్సులోనే సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్‌గా పేరు సంపాదించుకున్న ఆయన డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం నిజంగా ఒక సంచలనమేనని చెప్పుకోవాలి. ఖచ్చితంగా పార్టీ తనకు టికెట్ కేటాయిస్తుందనే నమ్మకంతో ఉన్న నునవాత్ భూపాల్‌నాయక్‌తో ‘దిశ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అభిప్రాయాలను, లక్ష్యాలను, నేపథ్యాన్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే
బిజినెస్‌మెన్‌గా సక్సెస్.. రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి కారణం..
సమాజంలో ఎక్కువ మందికి సేవ చేయడానికి రాజకీయాలే మంచి మార్గమనేది నా అభిప్రాయం. బిజినెస్‌మెన్‌గా నేను సాధించినా దాంతో నాకు చాలా తృప్తి ఉంది. గత ఏడేనిమిదేళ్లుగా నేను సంపాదించుకుంటున్న కొంతలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ వస్తున్నాను. సేవ అంటే మన దగ్గర ఉన్నదాన్ని పంచిపెట్టడం మాత్రమే కాదు. అది సమాజంలోని అన్ని కోణాల్లోనూ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రయోజనాలను ప్రజలకు అందించడం జరగాలి. నేను చాలా అట్టడుగు నుంచి ఈ రోజు మంచి వ్యాపార వేత్తగా సమాజంలో గుర్తింపు దక్కింది.
అయితే నేను నడిచి వచ్చినా బాటను మాత్రం మర్చిపోను. కష్టపడేవారికి న్యాయం దక్కాలి. ప్రతిభావంతులైన యువతకు విద్య ఉపాధి అవకాశాల కల్పన జరగాలి. పేదలకు సంక్షేమ ఫలాలు దక్కాలి. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉండి మాత్రమే చేయగలం. అందుకే నా మనసులోని ఉద్దేశాలకు రాజకీయాలు సరైన మార్గమనిపించింది. అంబేద్కర్ చెప్పినట్లుగా అన్ని పనుల సాధనకు రాజకీయాధికారం అనేది మార్గం అని నమ్ముతాను. స్పష్టమైన అభిప్రాయాలు, లక్ష్యాలతోనే నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. వచ్చాను. సేవే నాలక్ష్యం.. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధియే లక్ష్యంగా డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాల్లో అడుగుపెట్టా. ఖచ్చితంగా ఇక్కడి ప్రజల ఆశీర్వాదం, సహకారంతో అనుకున్నది సాధిస్తా.
డోర్నకల్ నియోజకవర్గంపై మీకున్న అవగాహన, అభిప్రాయం ఏంటీ..?
రాష్ట్రంలోనే అత్యధికంగా గిరిజన పేదలున్న నియోజకవర్గం ఇది. వందకు పైగా తండాలున్నాయి. చాలా మంది నిరుపేదలున్నారు. ఇప్పటికి ఇక్కడ చెప్పుకోదగిని విద్యాసంస్థలు నెలకొల్పలేదు. నియోజకవర్గంలో కీలక మండలకేంద్రంగా ఉన్న మరిపెడలో బస్టాండ్ కూడా సరిగా లేదు. విద్య, వైద్యం, రవాణా, ఉపాధి కల్పనలో ఈ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. చాలా తండాలను స్వయంగా పరిశీలించాను. స్వార్థపూరిత రాజకీయ నాయకులు.. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో తమ పబ్బం గడుపుకుని ప్రజలను వదిలేస్తున్నారు.
పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తోంది. మరి డోర్నకల్‌లో ఎందుకు జరగడం లేదు..! కేవలం అసమర్థ లంచగొండి, స్వార్థపూరిత రాజకీయమే నియోజకవర్గం వెనుకబాటుతననానికి కారణం. గడిచిన కొద్దిరోజుల్లోనే డోర్నకల్ ప్రజల్లో ఆలోచన చైతన్యం కనిపిస్తోంది. ప్రజల ఆలోచనల్లో మార్పు మొదలైంది. ముఖ్యంగా యువత సంప్రదాయ రాజకీయ మోసగాళ్లపై తిరుగుబాటు చేసే కాలం దగ్గర పడింది. స్వార్థ రాజకీయ నేతలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
మిగతా అన్ని నియోజకవర్గాల కన్నా ఈ నియోజకవర్గం 15 ఏళ్లు వెనుకబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రశ్నించేవాళ్లు సక్రమంగా లేకపోవడంతో నియంత పోకడలు కనిపిస్తున్నాయి. యువత ప్రతిభ నిర్వీర్యమైపోతోంది. వారికి ఉన్న చోట సరైన భవిష్యత్ లేకుండా పోతోంది. కొన్ని తండాలను పంచాయతీలు చేసి వదిలేశారు. తండాల్లో స్వయం పాలన జరుగుతోందన్నది భూటకం. నాలుగైదు తండాలకు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు.
వాస్తవానికి ఒక్కో తండాకు మధ్య రెండు నుంచి మూడు నాలుగైదు కిలోమీటర్ల వ్యత్యాసం కూడా ఉంది. జనాభా ప్రాతిపదికనే స్థానిక సంస్థల గుర్తింపు సరైంది కాదు. విస్తీర్ణం, దూర ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేది. డోర్నకల్ నియోజకవర్గం కేంద్రంలో ఇప్పటి వరకు కూడా జూనియర్ కాలేజీ లేదు. డిగ్రీ కాలేజీ లేదు. అదే పొరుగున ఉన్న ఇల్లందు నియోజకవర్గానికి చెందిన గార్ల మండలంలో జూనియర్, డిగ్రీ కాలేజీ సైతం ఉన్నాయి. అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. స్థానిక ప్రజా ప్రతినిధికి ప్రజా సమస్యలపై, అభివృద్ధిపై ఎంతమాత్రం శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు.
డోర్నకల్ నియోజకవర్గంతో ఎలా అనుబంధం ఏర్పడింది..!?
గత ఐదేళ్లుగా నా సంస్థల ద్వారా ఈ నియోజకవర్గంలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నా చిన్నతనంలో హైస్కూల్‌కు వెళ్లడానికి 14కిలోమీటర్లు నడిచేవాన్ని. ఆ పరిస్థితి మరేవరికి ఉండకూడదని భావించాను. వేలాది మంది విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్‌లను ఇప్పిస్తున్నాను. గిరిజన మహిళలకు వివిధ స్వయం ఉపాధి అంశాలపై శిక్షణ, అవగాహన, మెళకువలు నేర్పిస్తున్నాం. అలాగే రైతులకు వ్యవసాయ ఆధునికీకరణ అంశాలపై శిక్షణ, అవగాహన కల్పిస్తున్నాం.
ఇవే కాకుండా ఆర్థిక సాయాలు అందజేస్తూ వస్తున్నాం. ఇక్కడి అన్ని వర్గాల ప్రజలు నన్ను అక్కున చేర్చుకుంటున్నారు. ఈ ఐదేళ్లలో వివిధ సందర్భాల్లో చాలా గ్రామాల్లో, తండాల్లో పర్యటించాను. ఇక్కడి ప్రజలతో నాకు ఓ అనుబంధం ఏర్పడింది. ఇక్కడి ప్రజల కోసం పనిచేయాలని అనిపించింది. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా డోర్నకల్‌ను విడిచేది లేదు. అంతిమంగా ప్రజాసేవ చేయడమే లక్ష్యం. దానికి వేదికలు ఎలాంటివన్నది నేను పెద్దగా పట్టించుకోను.
పార్టీ నుంచి ఎలాంటి సంపోర్ట్ లభిస్తోంది..? టికెట్ వస్తుందనుకుంటున్నారా..?
కాంగ్రెస్ అంటనే బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీ. అందుకే ఈ పార్టీలో చేరాను. టికెట్ వస్తుందన్న నమ్మకం ఉంది. పార్టీ అధిష్ఠానంలోని కీలక నేతల మార్గదర్శనంలోనే పనిచేస్తున్నాను. ప్రజా సమస్యలపై పోరాటానికే ఇష్టపడుతాను. నన్ను ఇక్కడి ప్రజలు నాయకుడిగా గౌరవం, గుర్తింపు ఇచ్చారు. నన్ను నమ్మి వేలాది మంది వెంట నడుస్తున్నారు. అది నాపై బాధ్యతను పెంచింది. టికెట్ వచ్చినా, రాకున్నా... డోర్నకల్ రాజకీయాల్లోనే ఉంటా. ఇక్కడి ప్రజలతోనే ప్రయాణం కొనసాగిస్తాను. తాత్కాలికంగా ఉండిపోయేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే గట్టి లీడర్ ఉంటే నా అవసరం ఉండేది కాదు. నా అవసరాన్ని ప్రజలు కూడా గుర్తించారన్న నమ్మకం కలిగింది. అందుకే డోర్నకల్ నుంచే పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాను.
చివరగా డోర్నకల్ ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు.?
నా ప్రయాణం మీతోనే. డోర్నకల్ రాజకీయాల్లోనే కొనసాగుతాను. వెనక్కి తగ్గేది లేదు. వెనకడుగు వేసేది లేదు. నాకు ఎలాంటి స్వార్థపూరిత, సంపాదన ఆలోచనలు లేవు. కేవలం నిస్వార్థంతో సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశమిస్తే పోటీ చేస్తాను. ప్రజా ఆశీర్వాదం కోరుతున్నాను.
ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారు..
మహిళలకు స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాను. యువతకు - చదువును బట్టి జాబ్‌లు పెట్టించే ప్రయత్నం చేస్తాను. రైతులకు ఆధునీకరణ వ్యవసాయం మెళకువలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాను. వృద్ధులకు జీవితాలకు ఆర్థిక, సంక్షేమ భరోసాకు కృషి చేస్తా.
మీ స్వస్థలం ఎక్కడా..? మీ కుటుంబ నేపథ్యం ఏంటీ..?
పుట్టింది కొడంగల్ నియోజకవర్గంలోని పొల్కంపల్లి గ్రామం సేవబండ తండా. బాల్యమంతా అక్కడే జరిగింది. మా తండాకు 14 కిలోమీటర్ల దూరంలోని జీడ్పీహెచ్‌ఎస్ పాలంపేట స్కూల్‌లో చదువుకున్నా. 10వతరతతి వరకు అక్కడే. 8నుంచి 10 వరకు రోజూ 14 కిలోమీటర్లు నడిచి వెళ్లేవాణ్ణి. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ ఎల్‌బీ కాలేజీలో జరిగింది. ఎంబీఏ హిందుస్తాన్ యూనివర్సిటీ చెన్నైలో పూర్తి చేశాను.2004 నుంచి వ్యాపారం చేస్తున్నా. ఇంటర్ నుంచే పార్ట్ టైం జాబ్ చేయడం అలవాటు. పేపర్ బాయ్‌గా..! పాల ప్యాకెట్లు, ఎస్టీడీ బూత్‌లో ఇలా చాలా చేశాను. అయితే కష్టాలను మెట్లుగా మల్చుకున్నాను. నా కష్టం నన్ను నిలబెట్టింది.