కాళ్లకు దండం పెట్టిన పల్లా... స్వీట్ తినిపించిన ముత్తిరెడ్డి
మూటలు.. ముఠాలే కాంగ్రెస్ విధానమని ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
దిశ,జనగామ : మూటలు.. ముఠాలే కాంగ్రెస్ విధానమని ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం జనగామ టికెట్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బుధవారం జనగామలో మొట్టమొదటిసారిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం ఖాయమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజా సంక్షేమం అనేది మచ్చు కూడా కనబడలేదని, 11 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, ప్రజా సంక్షేమాన్ని మరిచి టికెట్ల కోసం తన్నుకోవడం, డబ్బు మూటలు మార్చడం, ముఠాలు కట్టడం వరకే ఆ పార్టీ సరిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులకే ఐక్యత లేదని విమర్శించారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధిలో మళ్లీ పాతాళానికి పడిపోతామని ఆయన విమర్శించారు. జనగామ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వాళ్లు కన్నతల్లికి తిండి పెట్టని వారు ఒకరైతే, ఆరు నెలలకు కూడా నియోజకవర్గానికి రాని వ్యక్తి మరొకరు ఉన్నారని కొమ్మూరి ప్రతాపరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ను గూర్చి పరోక్షంగా విమర్శించారు. జనగామలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి చేపట్టాలని, అందుకు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.
ఒప్పించి మెప్పించే సంస్కృతి మాది
జనగామలో టికెట్ విషయంలో అభ్యర్థిని మార్చినా, సిట్టింగ్ ఎమ్మెల్యేను ఒప్పించి ఒకే వేదికపై తీసుకువచ్చి బిఆర్ఎస్ విజయానికి కృషి చేసే సంస్కారం తమ పార్టీది అని మంత్రి హరీష్ రావు అన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం ఆకాంక్షించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఈనెల15న జనగామలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని, ఈ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్న ఈ జనగామ పోరుగడ్డ స్ఫూర్తిని మరువలేమన్నారు.జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్గన్పూర్ పాలకుర్తి లో గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి దయాకర్‌రావు అన్నారు. అంతకు ముందు మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక జిల్లాలను ఏర్పాటు చేయడంతో,అనేక తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఉన్నారు.
కాళ్లకు దండం పెట్టిన పల్లా... స్వీటు తినిపించిన ముత్తిరెడ్డి
తనను గెలిపించిన మాదిరిగానే పల్లాను గెలిపించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జనగామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డి కాళ్లకు పల్లా రాజేశ్వర్ రెడ్డి దండం పెట్టారు. ప్రతిగా పల్లాను ముత్తిరెడ్డి ఆలింగనం చేస్తుకున్నారు. అంతకుముందు పల్లాకు ముత్తిరెడ్డి స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జనగామ ప్రజలకు సేవకుడిగా పని చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని జనగామ బిఆర్ఎస్ అభ్యర్థి ,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ బిఆర్ఎస్ అభ్యర్థిగా కరారైన అనంతరం మొట్టమొదటిసారిగా ఆయన బుధవారం జనగామ కు వచ్చారు.
సమావేశంలో ఆర్టీసీ చైర్మన్, జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు బోడ కుంటి వెంకటేశ్వర్లు, బసవరాజ్ సారయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి,జల్లి సిద్దయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున,మార్కెట్ చైర్మన్ బాల్దే సిద్ధి లింగం, చేవెళ్లి సంపత్, నిమ్మతి మహేందర్ రెడ్డి, మేకల కలింగరాజు,పార్టీ జిల్లా, మండల, నాయకులు పాల్గొనగా వివిధ గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.