అభివృద్ధికి ద్వారాలు.. ములుగుకు మున్సిపాలిటీ హోదా లాంఛనమే..
ములుగు పట్టణాభివృద్ధికి ద్వారాలు తెరుచుకున్నాయి.
దిశ, వరంగల్ బ్యూరో : ములుగు పట్టణాభివృద్ధికి ద్వారాలు తెరుచుకున్నాయి. మున్సిపాలిటీ ఏర్పాటుకు సాంకేతిక పరమైన చిక్కుముడులు వీడుతుండటంతో మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ లాంఛనమేకానుంది. ములుగు మున్సిపాలిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.. గవర్నర్ ప్రతిపాదనలు పంపించడంతో ఈ సారి ఆమోదం పొందడం ఖాయమేనని అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ములుగును మున్సిపాలిటీ చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమైంది. ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 12న మున్సిపాలిటీగా మార్చుతూ గెజిట్ కూడా విడుదల చేసింది. 2024 ఫిబ్రవరిలో సర్పంచ్ పదవీకాలం పూర్తయిన వెంటనే ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే మున్సిపాలిటీ ఏర్పాటుకు కావాల్సిన జనాభా లేకపోవడంతో సాంకేతికపరమైన చిక్కులతో ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపుతూ మున్సిపాలిటీ ఏర్పాటును ఆలస్యం చేస్తూ వచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ములుగు, జీవంతరావుపల్లి, బండారుపల్లి గ్రామాలను కలుపుకొని 20 వార్డులతో మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలని గెజిట్ విడుదల చేసింది. సాంకేతిక పరమైన చిక్కును అధిగమించేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం జాకారం గ్రామ పంచాయతీని సైతం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో వార్డుల సంఖ్య పెరగనుంది. ప్రభుత్వం రూపొందించిన పాత బిల్లును రీకాల్ చేస్తూ మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపింది. ములుగు మున్సిపాలిటీ బిల్లు గవర్నర్ వద్దకు చేరి ఆమోదం పొందనుంది.
అందుబాటులోకి వస్తే..!
ములుగు పట్టణాభివృద్ధికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. పట్టణ ప్రజలకు సక్రమపాలన, సమర్థవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో వీటిని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో పనులను కొనసాగిస్తోంది. రెగ్యులర్‌గా ఇచ్చే నిధులతో పాటు పట్టణప్రగతి ద్వారా మౌలిక వసతుల కల్పన పై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దాంతో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపునకు నిధులు సమకూరనున్నాయి. టీజీబీపాస్, సమీకృత మార్కెట్లు, నర్సరీలు, మెకనైజ్డ్ దోబీఘాట్, బయోమైనింగ్, మానవవ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు, ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు ప్రత్యేక వ్యవస్థ, మాస్టర్‌ప్లాన్, డిజిటల్ డోర్ నంబరింగ్ వంటి పది రకాల అభివృద్ధి అంశాల్లో పట్టణ ప్రగతి మెరుగు పడే అవకాశం ఉంటుంది. ములుగు జిల్లా కేంద్రం అభివృద్ధి శర వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పలు పథకాలకు ములుగును ఎంపిక చేసే అవకాశం ఉంది. ములుగు జిల్లా టూరిజం హబ్‌గా ఉండటంతో జిల్లా కేంద్రం అభివృద్ధి కూడా ఆవశ్యకతను సంతరించుకుంది.
మున్సిపాలిటీతో పట్టణీకరణ పెరుగుతుంది.. ములుగు డీపీఓ దేవరాజ్
ములుగు జిల్లా కేంద్రమైన ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మారటంతో పట్టణీకరణ పెరిగి, మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎన్నో మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చి జిల్లా కేంద్రం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ములుగు జిల్లా కేంద్రాన్ని అందంగా మార్చేందుకు డెకరేటెడ్ పూల మొక్కలను నాటడం, ప్రతిరోజు ఉదయం కాలనీల నుంచి ప్రత్యేకమైన వాహనాల ద్వారా చెత్త సేకరించి పారిశుధ్య పనులు నిర్వహిస్తుండగా ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీ గా మారడంతో మంచినీరు, పారిశుధ్యం, ప్రజా అవసరాల సేవలు మరింత మెరుగుపడతాయి.